ప్రేమకు కుల, మతాలు ఉండవు. ఎప్పుడు ఎవరి మధ్య ఎలా ప్రేమ చిగురిస్తుందో చెప్పలేము. కొన్ని సార్లు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేమ పుడుతుంది. ఖండతారలు దాటి కూడా ప్రేమ చిగురిస్తుంది. “పడమరటి సంధ్యరాగం” సినిమాలో అమెరికా వెళ్లిన హీరోయిన్.. అక్కడ అమెరికన్ యువకుడి తో పరిచయం ఏర్పడుతుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమ మారి చివరికి పెళ్లి వరకు వెళ్తుంది. అచ్చం అలానే చదువుకునేందుకు అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడి యువకుడితో ప్రేమలో పడింది. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించింది. చివరికి ప్రేమించిన వ్యక్తితో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్దమైంది. మరి.. ఆ తెలుగు అమ్మాయి, అమెరికా అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుట్టిందిదో..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కాకినాడ జిల్లాకు చెందిన ఉదయశంకర్, కుసుమ దంపతులు కొన్నేళ్ల క్రితం విజయవాడ వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. వారి కుమార్తె పేరు నివేదిత. ఆమె 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. చదువు అనంతరం అక్కడే ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో తన తోటి ఉద్యోగి అయిన చికాగోకు చెందిన బైరాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. కొంతకాలం తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తమ పెళ్లి పెద్దలను ఒప్పించి మాత్రమే చేసుకోవాలని బైరాన్ తో నివేదిత తెలిపింది. దీనికి బైరాన్ కూడా ఓకే అన్నాడు. దీంతో ఇద్దరూ కలసి ఇరువురి పెద్దల్ని ఒప్పించారు.
ఇరు కుటుంబాల సభ్యులు బైరాన్, నివేదితల పెళ్లికి పచ్చజెండా ఊపారు. వీరి నిశ్చితార్ధ వేడుకను గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఆగష్టు 11న విజయవాడలో వీరి వివాహం జరగనుంది. మొత్తానికి అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి తమ ప్రేమను గెలుపించుకుని త్వరలో ఒకటి కాబోతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.