యువ గళం పేరిట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెబుతున్నారు. పాదయాత్రపై నెలకొన్న సందిగ్ధత కూడా వీడింది. పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. కానీ, నిబంధనల నోటీసులను టీడీపీ నేతలు తిరస్కరించారు.
మరోవైపు ఈ పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి స్పందించారు. పాదయాత్ర పేరిట గ్రామాల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తారంటూ ప్రశ్నించారు. “ఏమోహం పెట్టుకుని గ్రామాల్లోకి వెళ్తావ్ లోకేష్? ‘యువగళం’ పాదయాత్ర కాదు ప్రజలపాలిట గరళయాత్ర. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాల మాదిరిగానే యువగళం కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు” అంటూ ఎమ్మెల్సీ కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.