ఆనం రామనారాయణ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక సింహపురి వాసులకు అయితే ఆనం కుటుంబం గురించి చెప్పనక్కర్లేదు. ఆనం కుటుంబాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆనం కుటుంబంలో రామనారాయణ రెడ్డి కీలకమైన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రలో మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. వివధ కారణాలతో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. 2019లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజల సమస్యల పరిష్కరం కోసం ఎవరిపై విమర్శలు చేయడానికి కూడా ఆనం వెనుకాడరు. తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు.
బుధవారం నెల్లురూ జిల్లాలోని రాపూరులో వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్ల సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. రోడ్లు, గుంతలు పూడ్చలేకపోతున్నామని.. తాగడానికి నీళ్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎమ్మెల్యే ఆనం మాట్లాడుతూ..” ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని అడగాలి. ప్రాజెక్టులు ఏమైనా కట్టామా? పనులు ఏమైనా మొదలుపెట్టామా? శంకుస్థాపన ఏమన్నా చేసామా? ఏమని ఓట్లు అడగాలి. పెన్షన్లు ఇస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా?. అలా అయితే గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చింది. కానీ ఏం జరిగిందో అందరికి తెలుసు. ఇల్లు కడతానన్నాని.. లే అవుట్లు వేశాం. ఇల్లుల్లేమైనా కట్టామా?. ఇప్పటికి ఆ లేఅవుట్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు.
అలానే ఎస్ఎస్ కెనాల్ నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామి ఇచ్చాం. మూడేళ్లు దాటిన కనీసం ఆ కెనాల్ గురించి పట్టించుకోలేదు. ఇదే విషయంపై సీఎం జగన్ కు ఎన్నోసార్లు చెప్పాం. అలానే అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించాం. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది ఆ కెనాల్ పరిస్థితి. కంటి ముందు నీళ్లున్నాయని సంతోషపడటమే తప్ప నీళ్లు తాగాలేని పరిస్థితి. కండలేరు దగ్గరే ఉన్నా రాపూరులోని ఒక్క చెరువును కూడా నీళ్లతో నింపలేకపోయాం. కండలేరు అభివృద్ధి విషయంలో మహానేత వైఎస్ఆర్ కలను నెరవేర్చలేకపోయాం. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ప్రజలు ప్రస్తుతం నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరు” అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మరి.. ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి