నెల్లూరు జిల్లా రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వీడారు. ఇప్పుడదే బాటలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుండి తప్పుకునే ఆలోచన చేస్తున్నారట. తనకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి కారణంగా కోటంరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన తనను కాదని, జిల్లాలో వేరే ముగ్గురికి మంత్రి పదవులు సీఎం జగన్ కట్టబెట్టారని కోటంరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కోటంరెడ్డి అసంతృప్తిని గమనించి జగన్.. పిలిపించుకుని కూడా మాట్లాడటం జరిగింది. అయినాసరే కోటంరెడ్డి సంతృప్తి చెందలేదని.. అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఒకే జిల్లా నుంచి రెండో ఎమ్మెల్యే కూడా పార్టీ వీడితే.. ఆ ప్రభావం మిగతా జిల్లాలపై కూడా పడుతుందని సీఎం జగన్ భావిస్తున్నారట. అందుకే కోటంరెడ్డికి కాల్ చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి.. కోటంరెడ్డి వద్దకు పార్టీ తరపున దూతల్ని కూడా పంపారని అంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్.. నెల్లూరు రూరల్ స్ధానంలో కోటంరెడ్డి రాజీనామా చేసినా సంసిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒకటి రెండు రోజుల్లోనే సీఎంతో చర్చించి శ్రీధర్ రెడ్డి ప్లేస్ లో కొత్త ఇంచార్జిని పెడతాం. ఎవరున్నా లేకపోయినా జగన్ చరిష్మాతో వైసీపీ అన్ని స్థానాలలో గెలుస్తుందని అన్నారు.