కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాబాసాగా జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వైసీపీ కౌన్సిలర్లు పెద్ద గొడవ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల తన వార్డులో పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తే ఏమాత్రం పట్టించుకోవడం లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డికి 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి మద్య గొడవ జరగడం.. అదే సమయంలో ముని రెడ్డికి మద్దతుగా మరో వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్, కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవిలు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషపై దాడికి యత్నించారు.
ఈ గొడవలో వైసీపీ కౌన్సిలర్లు ఖాజా, ఇర్ఫాన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బూతులు తిట్టుకుని బాహాబాహీకి దిగారు. అంతేకాదు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవల కారణంగా వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. పోలీసులు ఇరువర్గాలకు చెందిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ముష్టిఘాతాలకు పాల్పడ్డారు.