కన్నబిడ్డలనే కాలదన్నుకుంటున్న రోజులివి. కడుపున పుట్టిన పిల్లలను సైతం తమ స్వార్థం కోసం వేధిస్తున్న కాలాలివి. అలాంటి ఈ రోజుల్లో కూడా ఓ యువతి ఉన్నంతంగా ఆలోచించింది. చనిపోయిన తన అక్క బిడ్డల బాగు కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. ఎంతో గొప్ప, ఉన్నతమైన నిర్ణయం తీసుకుంది. కేవలం సినిమాల్లోనే చోటుచేసుకునే అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కుంచెనపల్లిలో జరిగింది. ఓ యువతి చనిపోయిన తన అక్క బిడ్డల బాగు కోసం బావను పెళ్లి చేసుకుంది. ఇందుకోసం కుటుంబాన్ని సైతం లెక్కచేయలేదు. ఓ వైపు కుటుంబం.. మరో వైపు అక్క బిడ్డలు అన్న ప్రసక్తి రాగా.. ఈ రెండిటిలో అక్క బిడ్డలే తనకు ముఖ్యం అనుకుంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి బావతో మూడు ముళ్లు వేయించుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కుంచనపల్లికి చెందిన ఓ మహిళ కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో మృత్యువాతపడింది.
ఇక, అప్పటినుంచి ఆమె బిడ్డలు తల్లి లేని లోటును అనుభవిస్తూ ఉన్నారు. ఆడతోడు లేని కుటుంబం కావటంతో పిల్లలతో సహా బావ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా ఆ పిల్లలు తల్లి ఎక్కడికి పోయిందని తండ్రిని అడిగితే ఏమీ చెప్పలేకపోయేవాడు. అయితే, దేవుడు ఒకటి తీసుకుపోతే మరొకటి ఇస్తాడంటారు. ఆ పిల్లల విషయంలోనూ అదే జరిగింది. తల్లిని తీసుకుపోయిన దేవుడు.. పిన్ని రూపంలో మరో తల్లిని వారికి జత చేశాడు. అక్క పోయిన తర్వాత ఆ పిల్లలు పడుతున్న బాధను చూసి వారి పిన్ని చలించిపోయింది. ఎలాగైనా వారిని అన్నీతానై చూసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, వారు ఇందుకు ఒప్పుకోలేదు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. బావకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు వద్దని వారించాడు. అయినా ఆమె వినలేదు. తన అక్క బిడ్డల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని తేల్చి చెప్పింది.
తర్వాత ఇంట్లో వాళ్లు ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. చంపుతామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలోనే బావ,మరదలు ఓ నిర్ణయానికి వచ్చారు. పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తాజాగా, పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన అక్క బిడ్డల సంతోషం కోసమే తాను బావను పెళ్లి చేసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. అక్క బిడ్డల బాగుకోసం తన జీవితంలోకి వచ్చిన మరదలిని ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ఆ బావ వాగ్ధానం చేశాడు. సదరు యువతి చేసిన గొప్ప పనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని అంటున్నారు. ఆమెను ఓ దేవత అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.