అది కరోనా మహమ్మారి విజృభిస్తున్న రోజులు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రభుత్వ అధికారులు ఇంట్లో కూర్చుంటే ప్రజల అవసరాలు తీరవు కదా. అందుకోసం రిస్క్ చేసి కొంతమంది అధికారులు ప్రజల కోసం పని చేశారు. ముఖ్యంగా మహిళా కలెక్టర్లు. డెలివరీ అయ్యి ఎన్నో రోజులు కాకపోయినా.. సెలవులు ఉన్నా కూడా లెక్క చేయకుండా విధుల్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాంటి వారిలో మరో మహిళా కలెక్టర్ ఉన్నారు.
డెలివరీ అయిన 14 రోజులకే 2 వారాల పసిబిడ్డతో మెటర్నిటీ లీవ్ లో ఉన్నా కూడా అత్యవసర పరిస్థితుల్లో తిరిగి విధుల్లో చేరిన కలెక్టర్ సౌమ్య పాండేను దేశమంతా కీర్తించారు. తాజాగా ఇదే బాటలో మరో కలెక్టరమ్మ చేరిపోయారు. డాక్టర్ గుమ్మళ్ల సృజన కర్నూలు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ గా పని చేసిన జి. బలరామయ్య, సుగుణశీల దంపతుల కుమార్తె ఈమె. తండ్రి కర్నూలు జిల్లాలో కలెక్టర్ గా పని చేశారు. తండ్రి పని చేసిన జిల్లాలోనే ఆమె కలెక్టర్ గా పని చేయనుండడం విశేషం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పక్కన పూడి గ్రామం వీరి స్వస్థలం.
ఈమె హైదరాబాద్ సెయింటెన్స్ కాలేజీలో బీఏ సైకాలజీ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశారు. 2012లో గ్రూప్-1కు ఎంపికైన సృజన మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో సెక్రటరీగా పని చేశారు. 2013లో సివిల్స్ ర్యాంకు సాధించి కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్ లో కీలక పాత్ర పోషించిన సృజన ప్రస్తుతం కర్నూలు జిల్లాకు 55వ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమె భర్త రవితేజ హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.
అయితే ఈ బాబు పుట్టిన 22 రోజుల్లోనే ఆమె డ్యూటీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది కోవిడ్-19 మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన సమయం. లాక్ డౌన్ కొనసాగుతున్న రోజులవి. ఆ రోజుల్లో ఆమె గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేస్తున్నారు. అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నారు. మెటర్నిటీ సెలవులు తీసుకున్న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేని ఆమె తన మెటర్నిటీ సెలవులను రద్దు చేసుకుని తిరిగి విధుల్లో చేరారు. డెలివరీ అయిన 22 రోజుల్లోనే ఆమె విధుల్లో చేరి అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.