శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఊరి బాగు కోసం రోడ్లు వేయిస్తాడు. ఇతర అవసరమైన పనులు చేస్తాడు. అయితే, ఇది సినిమా.. సినిమాలో హీరో బాగా డబ్బు ఉన్న వ్యక్తి. కానీ, నిజ జీవితంలో ఓ పెదరాలు గొప్ప మనసు చాటుకుంది.
ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు ప్రాంతలోని అల్లూరి జిల్లా ముంచంగి పుట్టు మండలంలోని తోటగుడ్డి పుట్టు ఆదివాసి గ్రామానికి చెందిన జమ్మి అనే ఆశా కార్యకర్త ఊరి కోసం ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామం కోసం రోడ్డు వేయించాలని అనుకుంది. సొంత డబ్బులతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టింది. పేద కుటుంబానికి చెందిన ఆమె లక్షలు ఖర్చుపెట్టి రోడ్డు వేయిస్తోంది. తన గొప్ప మనసుతో పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. కష్టనష్టాలు ఎదురైనా తాను అనుకున్న పని కోసం పోరాడుతోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ… ‘‘ మా అమ్మా వాళ్లది అరుకు పక్కన చిన్న అంజారం.
నేను అక్కడే చదువుకున్నాను. పాడేరులో ఇంటర్ చదివాను. పెళ్లి తర్వాత ఈ ఊరు వచ్చాను. ఈ ఊరికి రోడ్డు లేదు. దగ్గరలో వాటర్ కూడా లేదు. రోడ్డు లేకపోవటం వల్ల బయటకు వెళ్లి ఏం తెచ్చుకోవాలన్నా ఇబ్బంది. వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది. అంగన్ వాడి కేంద్రానికి వెళ్లాలన్నా కూడా జోలపుట్టలో వెళ్లి తెచ్చుకుంటాము. గత సంవత్సరమే ఊరికి రోడ్డు వేయిద్దామని అనుకున్నా.. డబ్బులు సరిపోలేదు. అందుకే ఈ ఏడాది పనులు మొదలుపెట్టా. నేను చేస్తున్న పని తెలిసి కొంతమంది సహాయం చేశారు. నా సొంత డబ్బులు రెండు లక్షలు పెట్టాను. మిగిలిన వాళ్లు 50వేలు ఇచ్చారు.
ఇప్పటి వరకు రెండున్నర కిలోమీటర్లు రోడ్డు వేయించాను. చాలా మంది సరైన సౌకర్యాలు లేక ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. వారికి ఎంత చెప్పినా వినటంలేదు. ఎవ్వరూ బయటకు వెళ్లకూడదని నేను కోరుకుంటున్నాను. సరైన సౌకర్యాలు లేని కారణంగా నా ఇద్దరు పిల్లల్ని కూడా చదివించలేకపోతున్నాను’’ అంటూ వాపోయింది. మరి, తన సొంత డబ్బుతో ఊరి కోసం రోడ్డు వేయిస్తున్న జమ్మి మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.