ఇటీవల హోళీ సందర్భంగా రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు మూతబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మద్యం దుకాణాలు రెండ్రోజుల పాటు మూతపడనున్నాయి. ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల హోళీ సందర్భంగా రెండ్రోజులు మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు చెప్పుకోబోయేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మందుబాబులకు చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారాంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైన్స్ మరోసారి మూతపడనున్నాయి. మార్చి 11 సాయంత్రం నుంచి మార్చి 13 సాంయంత్రం వరకు మద్యం దుకాణాలను అధికారులు మూసేయాలని ఆదేశించారు. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో కాదులెండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉపాధ్యాయ పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో రెండ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 8 స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 13న ఈ ఎన్నికలను ఈసీ నిర్వహించనున్నారు.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానం, హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ పట్టభద్రుల స్థానాల్లో, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాలను మూసి వేయాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.