2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఐతే పవన్ ఓడిపోవడానికి కారణం కుల సమీకరణాలన్న విషయం అని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కులం పాత్ర చాలా పెద్దది. ఈ సమీకరణాలు తెలియకుండా భరిలోకి దిగితే ఓటమి చవి చూడవలసి వస్తుంది. అయితే ఈ ఓటమి నుండి జనసేనాని పాఠాలు నేర్చుకున్నట్టే కనబడుతోంది ప్రస్తుతం పవన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. ఎందుకంటే ఈసారి కూడా ఓడిన నియోజకవర్గం నుండే భీమవరం పోటీ చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. గాయపడిన సింహం యొక్క శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని నిరూపించడానికి జనసేనాని సిద్ధమవుతున్నారు. దీని కోసం ఇప్పటికే వైసీపీ తరపున నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి, ఆ పార్టీతో విబేధాలు పెట్టుకున్న రఘురామ కృష్ణంరాజు సపోర్ట్‌ను తీసుకోనున్నారన్న వార్తలు వస్తున్నాయి. పవన్ గెలుపు కోసం రఘురామ కృష్ణంరాజు రంగంలోకి దిగినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పవన్ కూడా రఘురామ రాజు పట్ల మొదటి నుండి సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. రఘురామరాజు కూడా పవన్ కళ్యాణ్ పట్ల మంచి ధృక్పథంతోనే ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తారన్న వార్తలు జనసేన వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. జనసైనికులు కూడా ఇదే కోరుకుంటున్నారు. రీసెంట్‌గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు కూడా పవన్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని, భీమవరం నుంచే రాష్ట్ర రాజకీయాలకు అడుగులు పడనున్నాయని గోవిందరావు అన్నారు. దీంతో భీమవరంలో ఎలాగైనా గెలవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కంటే కూడా జనసైనికులే ఎక్కువ పట్టుదలతో ఉంటారు. అందుకే జనసైనికుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రఘురామరాజుతో కలుస్తున్నట్టు సంకేతాలు అయితే కనబడుతున్నాయి.
రఘురామ కృష్ణంరాజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఒక పిలుపు ఇస్తే పనులు జరుగుతాయి. అలాంటి రఘురామ కృష్ణంరాజు జనసేనకి సపోర్ట్ చేస్తే ఆ సామాజిక వర్గ ఓట్లు కూడా పవన్‌కే పడతాయని జనసైనికులు భావిస్తున్నారు. పవన్‌కైనా, ఇంకెవరికైనా ఫాలోయింగ్ ఎంతున్నా కూడా చివరికి రాజకీయాలు కులం దగ్గరే కొట్టిమిట్టాడుతుంటాయనేది కాదనలేని వాస్తవం. జనం ఇంకా కులం ఊబి నుంచి బయటకు రాలేదు. ఈ ఊబిలోంచి రాకపోవడం కొందరికి మంచిదైతే, కొన్ని సందర్భాల్లో రాష్ట్రానికి చేటు చేస్తుంది. ఐతే పవన్, రఘురామ రాజుల పొలిటికల్ కాంబినేషన్ వల్ల రాష్ట్ర ప్రజలకు మంచే జరుగుతుందని జనసైనికులు భావిస్తున్నారు. మరి 2024లో పవన్ గెలుపు కోసం.. రఘురామ కృష్ణంరాజు రంగంలోకి దిగుతారా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.