ఉన్నట్టుండి టమాటా ధరలు పెరిగిపోయాయి. కిలో టమాటా కొనాలంటే రూ. 100 తీయాల్సి వస్తుంది. కనిష్టంగా అయితే రూ. 85 కంటే తక్కువ లేదు. మరి ఈ టమాటా ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు తగ్గుతాయి?
ఈ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. పెరిగిపోయిన ప్రతిసారీ సామాన్యుడు అనుకునే మాట.. అవి కూరగాయలు కాదు కూర’గాయాలు. కూర కోసం చేసుకోవాల్సిన గాయాలు అని అనుకుంటాడు. నిజమే మరి కిలో టమాటా కొనాలంటే మనసుకి గాయాలు అయ్యే పరిస్థితి. జూన్ నెల ప్రారంభంలో కూరగాయల ధరలు బాగానే ఉన్నాయి. రెండు వారాల క్రితం వరకూ దేశ వ్యాప్తంగా కిలో టమాటా రూ. 10 నుంచి రూ. 20 ఉండేది. కానీ ఈ రెండు, మూడు రోజుల నుంచే రేట్లు పెరిగిపోయాయి. టమాటాలు అయితే మరీ దారుణంగా కిలో రూ. 100 దాటేసింది. దేశంలో ఎక్కడ చూసినా కిలో టమాటా కనీస ధర రూ. 80కి తక్కువ లేదు. ఎందుకు టమాటా ధరలు ఇంతలా పెరిగాయి? కారణం ఏంటి? ఎప్పుడు ధరలు తగ్గుతాయి?
టమాటాలు మాత్రమే కాదు.. ఇతర కూరగాయల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల ఆర్బీఐ నిర్ణయించిన పరిమితి 6 శాతం కంటే ద్రవ్యోల్బణం తక్కువగా పడిపోవడంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. మరో కారణం ఏంటంటే.. రాజస్థాన్ లోని బిపార్జోయ్ తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా మార్కెట్లో టమాటా సహా ఇతర కూరగాయల కొరత ఏర్పడింది. దీంతో ధరల పెరుగుదలకు కారణమైంది. వర్షాకాలం సీజన్ కావడం, భారీగా వర్షాలు పడుతుండడంతో పంటలు గణనీయంగా దెబ్బతిన్నాయి. డిమాండ్ కి తగ్గా సప్లై లేకపోవడంతో ధరలు పెరిగాయి. అకాల వర్షాల కారణంగా టమాటా రవాణాపై ప్రభావం చూపిందని.. ఈ కారణంగా డిమాండ్ కి తగ్గట్టు సరఫరా ఆగిపోయిందని అంటున్నారు.
వర్షాలే కాకుండా అధిక వేడి గాలులు కూడా పంటలపై ప్రభావం చూపించాయని చెబుతున్నారు. టమాటా పాండే ప్రాంతాల్లో వేడి గాలుల వీచడం వల్ల సరఫరా తగ్గింది. మే నెలలో అయితే చాలా మంది రైతులు మహారాష్ట్రలో గిట్టుబాటు ధర లేక ట్రక్కుల్లో తెచ్చి రోడ్ల మీద పారబోశారు. అన్ని రకాల కూరగాయల ధరలు ఒకటి నుంచి రెండు రెట్లు పెరిగాయని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది టమాటా ధరలు పెరిగిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని ముంబైకి చెందిన కమోడిటీ మార్కెట్ నిపుణులు కేడియా అడ్వైజరీ అధిపతి అజయ్ కేడియా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు టమాటాలు తక్కువ పండించారని అన్నారు. గత ఏడాది బీన్స్ ధరలు పెరగటంతో చాలా మంది రైతులు టమాటాకు బదులు బీన్స్ పంట వేశారని అన్నారు.
అయితే వానాకాలంలో సరైన సమయంలో తగినంత వర్షాలు కురవకపోవడం వల్ల బీన్స్ పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గిందని.. సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉందని అన్నారు. భారీ వర్షాలు, విపరీతమైన వేడి వల్ల అన్ని కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. అధిక వర్షపాతం టమాటా పంటకు హాని చేసిందని.. దిగుబడి, నాణ్యతను తగ్గించిందని అన్నారు. ఈ కారణంగానే టమాటా ధరలు పెరిగాయని అన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ధరలు శాశ్వతం కాదని.. తగ్గుతాయని అన్నారు. 10, 15 రోజులు ఈ ధరలు మళ్ళీ మామూలు స్థితికి వస్తాయని అన్నారు.