ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురియడంతో పంటనష్టం ఏర్పడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం పూట ఎండ దంచికొడితే.. సాయంత్రం వేల అకస్మాత్తుగా కారుమబ్బులు పట్టి ఈదురు గాలులు, అకాల వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వడగండ్ల వానతో పంటలు నాశనం అవుతుంటే.. మరికొన్ని చోట్ల పిడుగు పాటుతో మనుషుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడటంవల్ల రాబోయే ఐదు రోజుల్లో ఓ మోస్తారులో వర్షాలు ఉంటాయని.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు ప్రాంతాల్లో క్రికెట్ బంతి సైజులో వడగండ్ల వానలు కురిసే ఆస్కారం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలాని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పుదుచ్చేరి, దక్షణి కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందిన ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణ లో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు చోట్ల పంటనష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అల్లూరి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కృష్ణ, ఏలూరు, పల్నాడు, నంద్యాల, కోనసీమ పరిసన ప్రాంతాల్లో తెలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.