సాధారణంగా రాజకీయాలు అంటే.. అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించి ఎక్కువగా వినిపించే ఆరోపణలు ఏంటంటే.. ప్రభుత్వ పథకాలు, స్కీమ్‌లను ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలకు అందకుండ అడ్డుకుంటారు అనే ఆరోపణలు ఎక్కువగా వినిస్తుంటాయి. లోకల్ లీడర్లు కొందరు.. మా పార్టీకి ఓటు వేయలేదు కదా మీకు పథకాలు దక్కనివ్వం అంటూ బెదిరింపులకు పాల్పడటం చూశాం. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి సంఘటనలు కలలో కూడా చోటు చేసుకోవు. అర్హులైతే చాలు.. పార్టీ, కులం, మతం తేడా లేకుండా.. ప్రభుత్వ పథకాలు అందుతాయి. అందుకోసం ఎవరి రికమెండషన్ అక్కర్లేదు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పలవురు విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీడీపీ నేత కుమార్తెకు ప్రభుత్వం నుంచి భారీ ఆర్థిక సాయం అందించింది. విదేశాల్లో చదువుకునేందుకు సదరు విద్యార్థినికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఏకంగా 84 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. విజయనగరం జిల్లా వంగర మండలం సంగాంకు చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు, వేణమ్మల కుమార్తె శైలజ విదేశాల్లో చదువుకోవాలని భావించింది.
ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం అందించే సాయం కోసం ఆమె జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకోగా.. అన్ని అర్హతలు ఉండటంతో ఈ పథకానికి ఎంపికైంది. ఈ పథకం తొలి విడత సాయంగా.. అందుకు సంబంధించిన మొత్తాన్ని.. ప్రభుత్వం శైలజ అకౌంట్‌లో జమ చేసింది. ఆ నిధులకు సంబంధించిన నమూనా చెక్కును విజయనగరం జిల్లా కలెక్టర్.. శైలజ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వేణమ్మలకు అందజేశారు.
రాన్ను రెండేళ్లలో శైలజ చదువు కోసం ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అందిస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం అర్హతే ప్రామాణికంగా విద్యార్థులను గుర్తించి సాయం అందిస్తున్నారని బొడ్రోతు శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు. టీడీపీ నేత కుమార్తెకు ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ సాయం అందడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.