అందం విషయంలో ఆడవారికి కాస్త శ్రద్ధ ఎక్కువ. అయితే ఈ మధ్యకాలంలో మగవారు కూడా అందానికి బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక అందాల పోటీలకుండే క్రేజే వేరు. వీటిల్లో పాల్గొని.. కిరీటం గెలుచుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతుంటారు. ఇక విశ్వ సుందరి, మిస్ ఇండియా పోటీలకు ఏటా ఎంత మంది సిద్ధమవుతుంటారో చూస్తూనే ఉన్నాం. కొన్నాళ్ల క్రితం వరకు ఇలాంటి పోటీలు అంటే తెలుగు మహిళలు పెద్దగా ఆసక్తి చూపకపోయేవారు. అయితే నేడు పరిస్థితి మారింది. అందాల పోటీల్లో పాల్గొనేందకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ మహిళ ఒకరు అరుదైన ఘనత సాధించింది. మిస్ ఆసియా పోటీల్లో గెలిచి కిరీటం సొంతం చేసుకుంది. ఆ వివరాలు..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 19న జరిగిన మిసెస్ ఆసియా పోటీల్లో విశాఖపట్నం సఖినేటిపల్లికి చెందిన అల్లూరి సరోజ అనే మహిళ కిరీటం కైవసం చేసుకుంది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత మహిళగా సరోజ రికార్డు సృష్టించింది. అంతేకాక ప్రధాన టైటిల్‌తో పాటు మిసెస్ పాపులారిటీ, పీపుల్స్ చాయిస్ అవార్డులు కూడా గెలుచుకుంది సరోజ. ఈ పోటీల్లో జపాన్, ఫిలిప్పీన్స్, చైనా, థాయ్‌లాండ్, మంగోలియా, ఇండోనేషియా వంటి దేశాలకు చెందిన మహిళలతో పోటి పడి.. సరోజ కిరీటం సొంతం చేసుకుంది.
ఇక సరోజ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తుంది. ఆమెకు భర్త, ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె సంతానం ఉన్నారు. వీరు లాస్‌ఏంజెల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇక వైజాగ్‌లో పుట్టి పెరిగిన సరోజ.. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు.. న్యూయార్క్ విశ్వ విద్యాలయంలో నుంచి మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఏటీఅండ్‌టీ కంపెనీలో టెక్నాలజీ లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవి మాత్రమే కాక సరోజ మంచి డ్యాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్వచ్ఛంద సేవకురాలు కూడా. ఇక సరోజ తల్లిదండ్రులది అంబేద్కర్ జిల్లా కాగా.. ఉద్యోగాల వల్ల విశాఖలో సెటిల్ అయ్యారు. ఇక సరోజ ఈ టైటిల్ సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.