ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. అంబులెన్స్ సదుపాయం లేక మృతదేహాలను వాహనాలపై, భుజాలపై వేసుకొని తరలిస్తున్న దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల జరగుతున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరుపోతున్నాయి. తాము అడిగినంత డబ్బు ఇస్తేనే వస్తాం అంటూ పేద ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు అంబులెన్స్ సిబ్బంది. దాంతో అంబులెన్స్ లేక మృతదేహాలను భుజంపై వేసుకొని, ద్విచక్ర వాహనాల మీద తరలించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిపై అప్పటికప్పుడు తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు. తాజాగా ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ఓ చిన్నారి కన్నుమూసింది. తమ చంటిబిడ్డను తరలించేందుకు అంబులెన్స్ కోసం ఎంతో సేపు ఎదురు చూశారు తల్లిదండ్రులు.. కానీ వారు అందుబాటులోకి రాలేదు. అంబులెన్స్ కోసం కేజీహెచ్ సిబ్బందిని తల్లిదండ్రులు ప్రాధేయపడినా వారు ఏమాత్రం కనికరించలేదు. దీంతో చేసేదేమీ లేక స్కూటీపై 120 కిలోమీటర్లు ప్రయాణించి పాడేరకు తీసుకు వెళ్లారు చంటిబిడ్డ తల్లిదండ్రులు. అల్లూరి జిల్లా కుమడ గ్రామానికి చెందిన దంపతు బిడ్డ గురువారం విశాహ కేజీహెచ్ లో మృతి చెందింది. హాస్పిటల్ నుంచి పాడేరుకు 120 కిలోమీటర్లు దూరం ఉంది. చిన్నారి మృత దేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కోరితే కేజీహెచ్ సిబ్బంది నిరాకరించడమే కాదు.. దురుసుగా ప్రవర్తించారని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక గత్యంతరం లేక చిన్నారి తల్లిదండ్రులు విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరకు వరకు 120 కిలోమీటర్ల వరకు మృత శిశువును మద్యలో కూర్చోబెట్టుకొని ప్రయాణం చేశారు. స్కూటీపై చిన్నారి మృతదేహంతో బయలు దేరిన విషయం తెలుసుకున్న కేజీహెచ్ వైద్య సిబ్బంది తప్పను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే పాడేరుకు అంబులెన్స్ ని పంపించి అక్కడ నుంచి చిన్నారి మృతదేహాన్ని సొంత గ్రామం అయిన కుమడ కు తరలించారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.