ఎంతో కష్టపడి కాళ్లు, చేతులు, కదిపితేనే ఈత కొట్టడం సాధ్యమవుతుంది. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఈత కొట్టగలడు, తేలియాడగలడు. ఇదేంటి ఈత ఎవరైన కొడతారు, కొంచె ప్రయత్నిస్తే నీటిపై తేలియాడుతారు.. దీనిలో ప్రత్యేకత ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తికి ఒక చేయి లేదు, మరో చేయి ఉన్నా లేనట్టే. ఇక ఉన్న రెండు కాళ్లును కదపడానికి వీలు లేకుండా తాళ్లతో కట్టేసుకున్నాడు. మరి.. ఇలాంటి స్థితిలో ఎవరైనా ఈత కొట్టగలరా? దాదాపు అసాధ్యం కదా? కానీ.., ఆ పరమ శివుణ్ణి నమ్ముకున్న ఓ భక్తుడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నం భీమిలి మండలం బసవపాలెం గ్రామానికి చెందిన శివయ్య పుట్టుకతోనే పోలియో బాధితుడు. దీని వలన తన ఎడమ చేయి పూర్తిగా లేకుండా పోయింది, కుడిచేతికి చిన్నగా రెండు వేళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ చేయి కూడా పని చేయదు. ఈ శివయ్య మొదటి నుంచి శివ భక్తుడు. ఇకపోతే తనకంటూ అయినవాళ్లు ఎవరు లేరు. తల్లిదండ్రులుగా శివుడినే భావించి ఆయన సేవలో తరించేవాడు. నిత్యం స్వామికి పూజలు చేస్తుండేవాడు. 15 ఏళ్ల క్రితం అంగవైకల్యం ఉన్న శివయ్య ఓ నదిలో స్నానానికి దిగిన సమయంలో ఈత రాకపోయినా తాను పైకి తేలడం గ్రహించాడు. అప్పటి నుండి నీళ్లపై తేలుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఆరేళ్ల క్రితం దాతల సాయంతో భీమిలి మండలం బసవపాలెంలో బసవేశ్వరుని పేరుతో శివాలయం నిర్మించాడు. ఏ మాత్రం చదువుకోని శివయ్య తాను నిర్మించిన ఆలయంలో స్వయంగా శివలింగానికి అష్టోత్తరాలు, పూజలు జరిపిస్తుంటాడు. ఈ క్రమంలో స్నానానికి వెళ్లే సమయంలో ఉన్న రెండు కాళ్లకు తాడును కట్టుకుని ఈత కొడుతూ, నీళ్లపై తేలుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దాంతో ఊరంతా శివయ్యకు ఏవో శక్తులు ఉన్నాయని అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి..