రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కడో ఒకచోట సంభవిస్తూనే ఉన్నాయి.
రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం ఛిన్నాభిన్నం కావడడమే. నిర్లక్ష్యం- అతివేగం ఇలా కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా మూల్యం మాత్రం చెల్లించకతప్పదు. అలా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో ఆరని చిచ్చును రగిల్చింది. ఓ చిన్నారి తల్లిని, అన్నను కోల్పోయి విలవిల్లాడింది. చనిపోయిన తల్లి ఎందుకు లేవడం లేదంటూ ఆమె అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ తండ్రి గుండె విలవిల్లాడింది. ఆ ఘటన చూసిన స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదం పాయకరావు పేట మండలం సీతారాముపురం సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. నలుగురికి గాయాలయ్యాయి. విశాఖ జిల్లా మల్కాపురానికి చెందిన డాక్ యార్ట్ ఉద్యోగి శ్రీనివాసరావుకు తీరని శోకాన్ని మిగిల్చింది. సమీప బంధువు మరణించడంతో దశదిన కర్మ కోసం శ్రీనివాసరావు కుటుంబం కోనసీమ జిల్లా గన్నవరం వెళ్లింది. ఆ కార్యక్రమంలో పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోరం సంభవించింది. సీతారామపురం పెట్రోల్ బంక్ సమీపంలో ఆగిఉన్న లారీని శ్రీనివాసరావు కారు ఢీకొట్టింది.
శ్రీనివాసరావు డ్రైవింగ్ చేస్తుండగా.. భార్య భారతి(44) ముందు సీటులో కూర్చుంది. వెనుక సీట్లో శ్రీనివాసరావు తల్లి వరలక్ష్మి, కుమారుడు మోహన్ బాలాజీ(19), కుమార్తె హేమ స్ఫూర్తి, చెల్లెలు ధనలక్ష్మి కూర్చొని ఉన్నారు. ఈ ప్రమాదంలో గుండె, తలకు గాయాలు అయ్యాయి. కుమారుడికి తల, కంటికి గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గం మధ్యలోనే వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. గాయాలపాలైన శ్రీనివాసరావు, కుమార్తె, తల్లి, చెల్లెలిని గాజువాక కిమ్స్ కి తరలించారు. శ్రీనివాసరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ చిన్నారి తండ్రిని అడుగుతున్న ప్రశ్నలు అందరినీ కంటతడి పెట్టించాయి. అమ్మ ఎందుకు లేవట్లేదు? కారులోనే ఉంది? అన్నని రోడ్డు మీద ఎందుకు పడుకోబెట్టారు? అన్న ముఖం అంతా రక్తం ఉందేంటి? నా చేయి ఎందుకు నొప్పిగా ఉంది? నాన్నా అసలు ఏమైంది? ఎందుకు మనం ఆస్పత్రికి వెళ్తున్నాం? అంటూ ఆ చిన్నారి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ తండ్రి గుండెలవిసేలా రోధించాడు. కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ఘటనలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.