'ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరండి..' ఇదేగా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ చెప్పేది. కానీ వినేవారు ఎవరు. అందరూ నటించేవారే. అందుకే అలాంటి వారిని దారిలోకి తేవడానికి విశాఖ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపింది.
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టారీతిన తిరుగుతున్న వారిని దారిలోకి తెచ్చేందుకు విశాఖ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ నిబంధనలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, కొందరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మనకు కాదులే అన్నట్లుగా వారు చేసే తప్పులకు అమాయక వాహనదారులు అనుకోని ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది. పోనీ ఇలాంటి వారికి చలాన్ వేసి దారిలోకి తెద్దామనుకున్నా.. అది కూడా జరగట్లేదు. కొన్ని వందల సంఖ్యలో చలాన్లు అయితే వేస్తున్నారు కానీ, అందులో 10% మంది కూడా చెల్లించడం లేదు. వీరి పని పట్టడానికి స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
నిబంధనలు తుంగలోకి తొక్కి వాహనాలతో రోడ్లపై పరుగులు పెడుతున్న వారి సంఖ్య విశాఖ మహానగరంలో అంతకంతకూ పెరిగిపోతోంది. అలాంటి వారికి చలాన్లు విధిస్తున్నా.. వాటిని చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 2021లో సుమారు 50 కోట్ల విలువైన 15 లక్షల చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే, గతేడాది తొమ్మిది లక్షల చలాన్లు విధించగా.. వీటి విలువ 22 కోట్లని సమాచారం. ఈ చలాన్లపై పోలీసుల దృష్టి పెట్టకపోవడంతో కొంతమంది వాహనదారులు మరింత రెచ్చిపోతున్నారని వినికిడి. చలాన్ పడినా.. చెల్లించాల్సిన పని లేదన్న ధీమాతో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారట. అలాంటి వారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవల విశాఖ సిటీలో 100పైగా ట్రాఫిక్ చలాన్లతో ఉన్న 20 మంది వాహనదారుల జాబితాను విడుదల చేశారు.
ఇలా కొంతమంది నుంచి వసూలు చేస్తున్నప్పటికీ, మరికొంతమంది తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారిని దారిలోకి తేవాలన్నదే వారి ప్రయత్నం. అందుకోసం ఈసారి పట్టుబడితే.. జరిమానా చెల్లించిన తర్వాతనే వాహనం విడిచిపెట్టేలా ప్రణాళికను సిద్ధం చేశారు. అలాగే, రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే ఉపేక్షించకూడదని పోలీసులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కావున వాహనదారులా ఇకనైనా జాగ్రత్తగా ఉంటూ ట్రాఫిక్ నిభందనలు పాటించాలని మనవి. లేనియెడల మీ వాహనాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. విశాఖ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.