మన దేశం ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ఎలా ప్రసిద్దో ఇక్కడి ప్రకృతి సోయగాలు కూడా అదే విధంగా అలరారుతాయి. దేశంలోని ప్రతి రాష్ట్రం దేనికదే ప్రత్యేకమైన ప్రకృతి అందాలతో అలరారుతుంది. వీటిని మరింత మెరుగ్గా అభివృద్ధి చేసి.. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ప్రతి పర్యాటక ప్రాంతానికి దానికే సొంతమైన కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఈ క్రమంలో విశాఖ ఏజెన్సీ కూడా ఇలాంటి ప్రత్యేక ప్రకృతి అందాలకు నెలవు. వీటిని ఆస్వాదించేందుకు నిత్యం సందర్శకులు వస్తుంటారు.
అయితే పెదలబుడు అనే గ్రామానికి వచ్చే పర్యాటకలు మాత్రం.. ఓ ప్రత్యేక అనుభూతిని సొంతం చేసుకుని వెళ్తున్నారు. అదేంటంటే.. మళ్లీ పెళ్లి చేసుకోవడం. అవును మీరు విన్నది కరెక్టే. ఈ గ్రామానికి వచ్చే వారు.. తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు.. ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.
పర్యాటక శాఖ అధికారులు పెదలబుడు గ్రామంలో ‘గిరి గ్రామ దర్శిని’ పేరుతో ఓ గిరిజన గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ‘గిరి గ్రామ దర్శిని’ని పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తుంది. స్థానిక గిరిజన యువత, గిరిజన మహిళ బృందాలు కలిసి ఈ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు.. ఇక్కడి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. అది నచ్చి వారిలాగే కట్టు, బొట్టు ధరించి అడవి బిడ్డలా మరిపోతున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళ అల్తుర్ ఎంపీ శ్రీ రమ్య హరిదాస్‌లు కూడా గిరిజన మహిళల్లా మేకోవర్ అయి గిరిగ్రామ దర్శినిలో సందడి చేశారు.
ఈ సందర్భంగా అరకు ఎంపీ మాధవి మాట్లాడుతూ.. ‘‘ఐటీడీఏ, ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్నవారు గిరిజన సంప్రదాయాల్లో జరిగే పండుగలు, వేడుకలు ఇక్కడ జరుపుకోవచ్చు. అలాగే గిరిజన పద్ధతుల్లో వివాహం చేసుకోవచ్చు. కట్టుబొట్టు నుంచి పెళ్లి విందు, అప్పగింతల వరకు వివాహ వేడుకంతా కూడా గిరి గ్రామ దర్శినిలో ఉన్న ఆదివాసీలే చూసుకుంటారు. కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను నేటి తరానికి కళ్లకు కట్టే విధంగా చూపించడమే ఈ గిరి గ్రామ దర్శని ప్రధాన ఉద్దేశం’’ అని తెలిపారు.
గిరి గ్రామాల్లో గిరిజన వధూవరులను ఎలా ముస్తాబు చేస్తారో అదే విధంగా గిరిజన సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలనే వారిని కూడా అలానే అలంకరిస్తారు. గిరిజన ఆభరణాలు దుస్తులతో వధూవరులను పెళ్లికి సిద్ధం చేస్తారు. గిరిజన గ్రామాల్లో పెళ్లి వేడుకకు కల్యాణ వేదిక తరహాలోనే మండపాన్ని ముస్తాబు చేస్తారు. వివాహానికి హాజరయ్యే వారిని కూడా గిరిజనుల మాదిరిగా తయారు చేస్తారు. గిరిజన ఆచారం ప్రకారం పెళ్లి తంతు పూర్తి చేస్తారు.
ఈ ఆలోచన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అందుకే ఈ గ్రామానికి వచ్చిన వారు తప్పనిసరిగా మళ్లీ పెళ్లి చేసుకుని మురిసిపోతున్నారు. దీని వల్ల పర్యాటకులకు మంచి అనుభూతితో పాటు.. అక్కడి వారికి ఆదాయం సమకూరుతోంది. ఈ విభిన్న కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.