ఆర్టీసీ బస్ తన స్కూటీకి డాష్ ఇచ్చిందనే ఆరోపణలతో.. బస్సులోకి ఎక్కి.. డ్రైవర్ పై మహిళ దాడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు మహిళపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడమే కాక.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు కూడా మహిళ మీద చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆమెపై కఠిన చర్యలు ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకు ముందు ఏం జరిగిందంటే..
విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం(ఫిబ్రవరి 10) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బస్సు తీసుకొని ప్రకాశం రోడ్డులో వెళ్తున్నాడు. ఆ సమయంలో నందిని అనే మహిళ స్కూటీ మీద వెళ్తూ బస్సుకు అడ్డొచ్చింది. దాంతో ముసలయ్య సడెన్ బ్రేక్ వేయగా.. బస్సు మహిళ సమీపంలోకి వెళ్లి ఆగింది. ఈ క్రమంలో బస్సు.. సదరు మహిళ స్కూటీకి చిన్న డాష్ ఇచ్చింది. ఈ చర్యతో ఆగ్రహించిన మహిళ.. డ్రైవర్‌పై అరుస్తూ.. బస్సు లోపలికి వెళ్లింది. ఇంజన్ మీదకు ఎక్కి మరీ డ్రైవర్ పై దాడి చేసింది. అతడి చెంప మీద కొట్టడమే కాక.. చొక్కా చింపి.. కాలితో తన్ని వీరంగం సృష్టించింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ని.. సదరు మహిళను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. డ్రైవర్ ఫిర్యాదుతో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.