వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన టీడీపీపై, టీడీపీ నాయకులపై.. సెటైరికల్ ట్వీట్స్ వేస్తూ.. వార్తల్లో ఉంటూ వస్తున్నారు. అయితే.., ప్రతిసారి ట్వీట్స్ కవ్వించే సాయిరెడ్డి.. ఈసారి ఏకంగా.. అవే ట్వీట్స్ ద్వారా టీడీపీకి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్ ఇలానే సంచలనంగా మారింది. గత కొన్ని నెలలుగా టీడీపీ భవిష్యత్ పై ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైన విషయం ఎవ్వరూ కాదనలేని సత్యం. ఎన్నికల్లో వరుస ఓటములు, మరోవైపు టీడీపీ నాయకులపై కేసులు వారిని ఇరకాటంలోకి నెట్టేశాయి. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు అసలు రాష్ట్రంలోనే ఉండటం లేదు. చినబాబు లోకేశ్ ది కూడా ఇదే పరిస్థితి. దీనితో టీడీపీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం లోపించింది. అయితే.. ఇప్పుడు జులై-23 ఏం జరుగుతుంది అంటూ టీడీపీలో చర్చ మొదలయ్యేలా చేశారు విజయసాయి రెడ్డి.”23వ తేదీ టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23న టీడీపీ అంతలా వణికింది. దీనికి తోడు..గోడదెబ్బ-చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జులై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా..? దేవుడు ఏం రాసిపెట్టాడో? అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 మే-23న ఎన్నికల ఫలితాలు రావడం టీడీపీ 23 సీట్లకే పరిమితం కావడం తెలిసిందే. అప్పటితో రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, జగన్ ప్రభంజనం మొదలైందని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అంతవరకు బాగానే ఉంది. అయితే గోడదెబ్బ-చెంపదెబ్బలాగా ఈ ఏడాది జులై-23న పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో? అని టీజింగ్ గా పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
23మంది టీడీపీ ఎమ్మెల్యేలలో నలుగురు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వారితోపాటు మరికొందరు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న టాక్ ఉంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అసలు వైసీపీపై విమర్శలు చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీనితో జులై-23 న వైసీపీలోకి వారి చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? చంద్రబాబు ఊహించని రేంజ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు మెజార్టీ మంది పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యార అన్న అనుమానాలు మొదలయ్యాయి. వారు చేసే రాజీనామాలకు జులై-23ని మహూర్తంగా పెట్టుకున్నారా..? అనేది డౌట్ వచ్చేలా విజయసాయిరెడ్డి ట్వీట్ ఉండటం గమనార్హం. పచ్చ పార్టీ పటాపంచలవుతుందన్న ట్వీట్ కి అర్థం ఇదేనంటూ కొంతమంది చెబుతున్నారు. కానీ.., ఇక్కడ ఓ విషయాన్ని చెప్పుకోవాలి. టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తే కొత్తగా వైసీపీకి వచ్చే లాభం లేదు. ఇదే సమయంలో టీడీపీకి పెద్దగా నష్టం లేదు. మహా అయితే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుంది. అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు ఇలాంటి పరిస్థితి తప్పదని ముందుగానే ఊహించి ఉంటారు. సో..టీడీపీ కి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి మాత్రమే అయితే.. ఇంత హడావిడి అవసరం లేదు. మరి విజయసాయిరెడ్డి ట్వీట్ లో అంతరార్ధం ఏమిటి? చంద్రబాబు విషయంలో వైసీపీ ఇంకేదైనా ప్లాన్ చేసిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద విజయసాయి ట్వీట్ ఇప్పుడు అనేక చర్చలకి కారణం అవుతోంది. మరి.. రెడ్డి గారు పెట్టిన మహూర్తానికి ఏం జరుగుతుందో చెప్పండంటూ నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఈ ట్వీట్ కలకలం ఎక్కువ అయ్యింది. మరి జులై-23 ఏమి జరగబోతుందో చూడాలి.