Vasireddy Padma: టీడీపీ నేత లైంగిక వేధింపుల కారణంగా ఓ చిన్నారి బలైపోవటం దారుణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకుడి వేధింపుల వల్ల ఓ బాలిక చనిపోయినా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపుల కారణంగా ఓ చిన్నారి బలైన ఘటనపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ నేతలు తరుచూ ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. మహిళలపై అరాచకాలను చంద్రబాబు మూగ ప్రేక్షకుడిగా చూస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? మహిళా పక్షపాత ప్రభుత్వంలో మహిళలపై అరాచకాలను సహించేది లేదు.
నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టం. ఉరి వేసుకునే ముందు బాధితురాలు సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసింది. అందులో టీడీపీ నాయకుడు రాళ్లపల్లి ఇంతియాజ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. ఇంతియాజ్ తన కోరిక తీర్చక పోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తానని బెదిరించాడని, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వీడియోలో పేర్కొంది. అతడి వేధింపులు భరించలేకే ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం కదిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ చేస్తున్నారు’’ అని తెలిపారు. విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని అదేశించారు.