గత కొంత కాలంగా ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కాపు సామాజికవర్గం చర్చనీయాంశమవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో కాపుల విషయమే హాట్ టాపిక్ అయింది. ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాన్ ఏపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు.. దానికి కౌంటర్ గా ఏపీ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనాలకు దారి తీస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో మంత్రి పేర్నినాని చేసిన కాపుల ప్రస్తావన సొంత కులంలోనూ చిచ్చు రేపుతోంది. మేంమేం ఒక్క కులపోల్లం.. సవాలక్ష అనుకుంటాం.. మేమింతే.. అంటూ నాని చేసిన ఆ వ్యాఖ్యలపై కాపులు రగిలిపోతున్నారు.
తాజాగా ఈ విషయంపై వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెంలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణకు వెళ్లారు. అనంతరం ప్రసంగించిన రాధా నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని.. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారన్నారు. గతంలో మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయామన్న రాధా… ఇప్పుడైనా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నానన్నారు.
ఈ మద్య పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లేదో గొప్పగా భావిస్తూ… పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారని రాధా మండిపడ్డారు. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా సరే కాపాడుకోవాలన్నారు. రాధా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అవుతోంది.