వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్- విశాఖ మధ్య వందభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో 3 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఇస్తూ రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ పెరిగింది. ప్రయాణికులు సాధారణ రైళ్లలో కంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో ప్రయాణించేందుకు ఎక్కువ ఇష్ట పడుతున్నారు. అందుకే ఆ సర్వీసులను కేంద్రం పెంచుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల భక్తులు కోరుకున్నట్లు సికింద్రాబాద్- తిరుమల రూట్ లో వందేభారత్ రైలు పరుగులు పెట్టబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందేభారత్ రైళ్లను కేటాయిస్తూ రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది.
అందులో భాగంగానే సికింద్రాబాద్- తిరుపతి మధ్య ఒక సర్వీస్ ని ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన రూట్ ని కూడా దాదాపుగా ఖరారు చేశారు. అయితే రైలు నంబర్, ప్రయాణించే వేళలు మాత్రం ప్రకటించలేదు. సాధారణంగా ఇప్పుడు నడుస్తున్న రైళ్లలో తిరుపతి వెళ్లేందుకు దాదాపు 12 గంటల వరకు సమయం పడుతుంది. అయితే గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ రైలులో అయితే ఆ సమయం మరింత తగ్గే అవరకాశం ఉంటుంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ సర్వీస్ ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఏర్పాట్లు చేయాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వేకి ఆదేశాలు కూడా జారీ చేశారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ సర్వీస్ కనీస టికెట్ ధర దాదాపు 1,150గా ఉండచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. ఖాజీపేట- విజయవాడ- తెనాలి- ఒంగోలు మీదుగా ఒక మార్గం ఉంది. రెండోది బీబీనగరం- నల్గొండ- గుంటూరు- తెనాలి- నెల్లూరు మీదుగా తిరుపతి వెళ్లేలా మరో మార్గంలో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రస్తుతానికి నారాయణాద్రి మార్గం- గుంటూరు మీదుగా నడపాలని ఆలోచిస్తున్నారు. భవిష్యత్ లో మాత్రం గుంటూరు టచ్ కాకుండా శావల్యాపురం మీదుగా ఒంగోలు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.