ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ. శ్రీవారి భక్తుల సేవే పరమావధిగా వేలాది మంది ఉద్యోగులతో నడుస్తున్న సంస్థ. ప్రసాదాల అమ్మకం, సేవా టిక్కెట్ల విక్రయం, అద్దె గదుల కోటాయింపులో లాభాపేక్షకు అతీతంగా టీటీడీ వ్యవహరిస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం, భక్తుల విరాళాలు దేవస్థానానికి ముఖ్య ఆదాయ వనరులు. అయితే లాభాలు ఆశించకుండా భక్తులకు చేరువయ్యే విభిన్న మార్గాలపైన గత కొంతకాలంగా టీటీడీ దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే అగరుబత్తీల తయారీ, పంచగవ్యాల ఉత్పత్తుల విక్రయానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆలయాలలో వినియోగించే పుష్పాల నుంచి అగరుబత్తీల తయారీ రంగం అంశం టీటీడీని ఆకర్షించింది. అనుకున్నదే తడవుగా ఈ రంగంలోకి అడుగు పెట్టబోతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళాలు వెదజల్లే అగరబత్తులు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శ్రీనివాసుని ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో ఈ అగరబత్తులు తీసుకొస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. సెప్టెంబరు 13 నుంచి వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తుల తయారీ కేంద్రానికి తరలిస్తారు. రకాల వారీగా పుష్పాలను వేరు చేస్తారు. అనంతరం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ తరువాత పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తులు తయారుచేస్తారు.
వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావణంలో ముంచుతారు. చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తులు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు.
టీటీడీకి చెందిన వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో ఏడుకొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లతో ఈ అగరబత్తీలను తయారుచేశారు. లాభాపేక్ష లేకుండా బెంగుళూరుకు చెందిన దర్శన్ సంస్ధ ఈ అగరబత్తీలను తయారు చేస్తోంది.
1.అభయహస్త
2. తందనాన
3. దివ్యపాద
4. ఆకృష్టి
5. సృష్టి
6. తుష్టి
7 దృష్టి ……పేర్లతో తయారైన అగరబత్తీలను మొదట తిరుమలలోని లడ్డూ కౌంటర్లవద్ద, తిరుపతిలోనూ విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.