తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ కొత్త రూల్ తీసుకొచ్చింది. భక్తులకు సజావుగా సేవలను అందించడంతో పాటు పారదర్శకత కోసం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇవే..!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడ్ని క్షణ కాలమైనా కనులారా చూద్దామని ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా తట్టుకుని సుదూరాల నుంచి తిరుమలకు చేరుకుంటారు భక్తులు. అలాంటి భక్తులు ఈ మార్పులు తెలుసుకోవాల్సిందే.. నేటి నుంచి తిరుమలలో భక్తులకు ఫేస్ రికగ్నిషన్ను అమల్లోకి తీసుకొస్తున్నారు. భక్తులకు సేవలను సజావుగా అందించడంతో పాటు పారదర్శకత కోసం తిమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తొలుత సర్వదర్శనం (ఉచిత దర్శనం) కౌంటర్లు, తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, వసతి కేంద్రాల్లో ప్రవేశపెట్టారు.
ఈ విధానంతో దళారుల వ్యవస్థ తగ్గే చాన్స్ ఉందని టీటీడీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమల్లోకి తీసుకురావడం వల్ల ఒక్కో భక్తుడు నెలకు ఒకసారి మాత్రమే తిరుమలలో రూమ్ పొందేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. దీంతో నెలలో ఒకసారి మాత్రమే ఉచిత దర్శనం చేసుకునేందుకు భక్తులను అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త విధానం వల్ల తిరుమలలో ఉచిత దర్శనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు ఇకపై నెల వ్యవధిలో ఒక్కసారికే పరిమితమవుతారని తెలిపారు.
భక్తుల కోసం సబ్సిడీ అద్దె గదుల కేటాయింపులోనూ ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ఉపయోగపడుతుందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. గదుల కేటాయింపులో పారదర్శకతకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. గదులను పొంది.. వాటిని ఎక్కువ రేటుకు విక్రయించే మధ్యవర్తులను గుర్తించడంలో కొత్త విధానం టీటీడీకి సహకరించే చాన్స్ ఉంది. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. మంగళవారం స్వామివారిని 59,392 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,714 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. మరి.. శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ తీసుకొచ్చిన కొత్త విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.