పది పాసైతే చాలు టీటీడీలో ఉద్యోగం, లక్ష వరకూ జీతం.. కానీ..
టీటీడీలో ఉద్యోగం వస్తుందంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి. అవసరమైతే లంచం ఇచ్చైనా సరే ఆ ఉద్యోగం సొంతం చేసుకోవాలని అనుకుంటారు కొంతమంది. లక్ష అటూ ఇటూ అయినా పర్లేదు ఉద్యోగం వచ్చాక బాగా సంపాదించుకోవచ్చు, జాబ్ గ్యారంటీ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో కేటుగాళ్ల ట్రాప్ లో పడుతున్నారు. టీటీడీలో ఉద్యోగం ఆశ చూపించి కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. పదో తరగతి పాసైతే చాలు టీటీడీలో ఉద్యోగం ఇస్తామని, రూ. లక్ష వరకూ జీతమంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు కనబడుతున్నాయి. ఆ ప్రకటనలు చూసి నిజమేమో అని కొంతమంది కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. లక్ష అయినా పర్లేదు జాబ్ వస్తుంది కదా అని కట్టేసి మోసపోతున్నారు.
అయితే ఇటువంటి ప్రకటనలను నమ్మి మోసవద్దని టీటీడీ కోరుతుంది. తాజాగా టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాలను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. పదో తరగతి పాసైన వారికి లక్ష రూపాయల వరకూ జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై టీటీడీ ఐటీ జీఎం సందీప్.. తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదో తరగతి అర్హతతో లక్ష జీతం వచ్చే ఉద్యోగం ఇస్తామని తప్పుడు ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాల చిరునామాలను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. వీటి పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సందీప్ కోరారు.
టీటీడీలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. ఇలాంటి ప్రకటనలను నిరుద్యోగులు ఎవరూ నమ్మి మోసపోవద్దని సందీప్ కోరారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అధికారిక వెబ్సైట్ (https://www.tirumala.org/) ద్వారా ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న 43 నకిలీ వెబ్సైట్లపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాబట్టి ఇలాంటి ప్రకటనల పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. డేటా ఎంట్రీ ఉద్యోగమని, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని రకరకాల ప్రకటనలు సోషల్ మీడియాలో వస్తుంటాయి. అధికారిక కంపెనీ ప్రకటనలు తప్ప మిగతా ప్రకటనలు నమ్మడానికి వీల్లేదు. నమ్మితే మోసపోవడం గ్యారంటీ. ఏ ఉద్యోగమైనా సరే డబ్బులు అడగరు. డబ్బులు కట్టి ఉద్యోగం ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోకండి.