విషాదం నెలకొంది. వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు ఆటోని ఢీ కొట్టడంతో ఆరుగురు మహిళా కార్మికులు మృతి చెందారు.
మాతృ దినోత్సవం నాడు విషాదం చోటు చేసుకుంది. ఆరుగురు మహిళా మూర్తులు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం రేపింది. మదర్స్ డే రోజు తమదే అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా పనికి వెళ్లారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని జీవితాలు. రొయ్యల కంపెనీలో కూలీలుగా చేస్తున్నారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మరణం ఒక ప్రైవేటు బస్సు రూపంలో వచ్చింది. అమాంతం ఆరుగురు మహిళా కార్మికులను మింగేసింది. దీంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
తాళ్లరేవు బైపాస్ వద్ద ప్రైవేటు బస్సు ఒక ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు మహిళా కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని కాకినాడ జీజీ హెచ్ కు తరలించారు. తాళ్లరేవు నుంచి యానాం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు రొయ్యల కంపెనీలో కూలీలుగా పని చేస్తున్నారు. యానాంలోని నీలపల్లి గ్రామానికి చెందిన వారిగా మృతులను గుర్తించారు. మృతులు, బాధితులు రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్నారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.