ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో విషాదం నెలకొంది. జమ్మలమడుగులో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నూర్జహాన్ అనే మహిళ మృతి చెందింది. పాత కాలం నాటి మట్టి ఇళ్లు కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలను అధికారులు, స్థానికులు తొలగించారు. శిథిలాల నుండి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆమె పిల్లలు తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకున్నారు. ఆ ఇంట్లోని ఒక వైపు భాగమే కూలిపోగా.. పిల్లలు మరో వైపు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూర్జహాన్, ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు. కాగా, ఆ ఇంటిలో కొంత భాగం ఒక్కసారిగా నేలకొరింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలన్నీ నాని, ఇంట్లోని ఒకవైపు భాగం కూలిపోయిందని పోలీసులు చెప్పారు. మొత్తం కూలి ఉంటే ఆ ముగ్గురు చనిపోయాయే వారని స్థానికులు చెబుతున్నారు. పక్క గదిలో ఉండటంతో వారంతా బతికారని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రొక్లెయిన్ పిలిపించి శిథిలాలు తొలగించి..నూర్జహాన్ మృతదేహాన్ని వెలికితీశారు. స్థానిక ఎమ్మెల్యే ఘటనాస్థలికి చేరుకుని నూర్జహాన్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.