కోడలు వస్తే గానీ అత్తల గుణం బయట పడదని అంటుంటారు. ఎవ్వరి మీద రానన్నీ జోక్స్, మీమ్స్ అత్త, కోడల బంధంపై వస్తాయి. కానీ వాస్తవంలో వారు స్నేహితులుగా మెలుగుతారు. దీనికి ఉదాహరణగా నిలిచారు ఈ అత్తా, కోడలు.
అత్తా, కోడలు అనగానే ఉప్పు నిప్పుగా ఉంటారని, చీటికి మాటికి పోట్లాడుకుంటారని, వారికి అసలు పొసగదని అపోహ ఉండనే ఉంది. అందుకే అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామెత కూడా వచ్చింది. అత్త అంటే పోరు అని, కోడలంటే పెత్తనం చెలాయిస్తుందని, వీరి మధ్య మగవాళ్లు నలిగిపోతుంటారని కథలు, కథలుగా చెప్పుకుంటారు. అత్త, కోడళ్ల మీద జోక్స్, మీమ్స్ అనేకం పుట్టుకొస్తుంటాయి. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి భర్తతో పంచుకోలేని చాలా విషయాలు కోడలు అత్తతో పంచుకుటుంది. అనుమానాలను నివృత్తి చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే పుట్టింట్లో నేర్చుకోలేని పనులను కోడలికి అత్త నేర్పిస్తుంది. ఈ సమయంలో కొంత మనస్పర్థలు ఏర్పడిన.. తిరిగి నచ్చ చెబుతుంది. ఇవన్నీ తెలియని వ్యక్తులే అత్త,కోడళ్ల బంధంపై బురద చల్లడం ప్రారంభించారు. అత్తా, కోడళ్ల మధ్య బంధం చావులోనూ విడదీయలేనిదని నిరూపించారు ఈ ఇద్దరు.
ఎన్నో ఏళ్లుగా కలిసి మెలిసి ఉన్న అత్త ఒక్కసారిగా చనిపోయిందన్న వార్తను దిగమించుకోలేని కోడలు.. కొన్ని గంటల్లోనే మృత్యువాత పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం తహశీల్దారు నిడిగంట్ల వెంకటరావు ఇంట్లో ఈ తీవ్ర విషాదం నెలకొంది. వెంకటరావు తల్లి దుర్గమ్మ, భార్య పద్మజ గంటల వ్యవధిలో మరణించారు. అత్తా, కోడలు ఒకే రోజు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ విషాద ఘటన లావేరులో చోటుచేసుకుంది. వెంకటరావు తల్లి దుర్గమ్మ (78) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది. మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆసుప్రతిలో చికిత్స పొందుతూ దుర్గమ్మ మృతి చెందింది. అయితే ఈ మరణ వార్తను కోడలు పద్మజ చెవిన పడింది. ఎంతో కాలంగా ఆమెతో మంచి అనుబంధం ఏర్పరుచుకున్న కోడలు.. అత్త చనిపోయిందన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. అత్త లేదన్న వార్తను జీర్ణించుకోలేకపోయిన కోడలు కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ బాధలోనే పద్మజకు(50)కు గుండె పోటు వచ్చింది. ఆమెను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల్లోనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో వెంకటరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్, శ్రీకాకుళం ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి తదితరులు పరామర్శించారు.