అన్నాచెల్లెల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేము. దేవుడు సృష్టించిన ఈ బంధంలో వారి మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చిన రెండో వారు తట్టుకోలేరు. తాజాగా ఓ అన్న.. గొడవలతో సాగుతున్న చెల్లెలి కాపురాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
అన్నాచెల్లెల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేము. దేవుడు సృష్టించిన ఈ బంధంలో వారి మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చిన రెండో వారు తట్టుకోలేరు. ముఖ్యంగా అక్కాచెల్లెల విషయంలో సోదరులు ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉంటారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపింన తరువాత.. వారు అక్కడ హాయిగా ఉండాలని ప్రతి సోదరుడు కోరుకుంటారు. సోదరికి బావకు మధ్య ఏమైన సమస్యలు ఉంటే పరిష్కరించి..వారి కాపురం సంతోషంగా ఉండేలా చూస్తాడు. అలానే ఓ అన్న కూడా గొడవలతో ఉన్న చెల్లి కాపురాన్ని చక్కబెట్టాలని భావించాడు. ఈక్రమంలోనే విధి చిన్నచూపు చూసి తిరిగి రానిలోకాలకు వెళ్లాడు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం తుమ్మవరం గ్రామానికి చెందిన పసుపులేటి తిరుపతి నాయుడు(28) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు కారు డ్రైవర్ గా ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తిరుపతి నాయుడుకి సుజాత అనే ఓ సోదరి ఉంది. ఆమెను తెనాలి ప్రాంతంలోని చిర్రూవూరుకు చెందిన రాకేశ్ కి ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపించాడు. అయితే పెళ్లై కొంతకాలం పాటు సుజాత సంసారం హాయిగా సాగింది. భార్యాభర్తలు ఎంతో సంతోషంగా కలసి మెలసి ఉన్నారు. అయితే కొంతకాలం నుంచి సుజాత కాపురంలో మనస్పర్థల కారణంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఇటీవలే మనస్పర్థల కారణంగా సుజాత పుట్టింటికి వచ్చింది. ఎన్నోసార్లు పెద్ద సమక్షంలో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. బావ రాకేశ్ కు ఎంత చెప్పిన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తిరుపతి నాయుడు పోలీసులను ఆశ్రయించాడు. అలానే చెల్లెలి కాపురం ఎలా చక్కబెట్టాలా? అని తనలో తానే మదనపడేవాడంట. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పోలీసుల సమక్షంలో బావ రాకేశ్, వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. బావతో మాట్లాడిన అనంతరం స్టేషన్ బయటకు వచ్చే క్రమంలో తిరుపతి నాయుడుకి గుండెపోటు వచ్చింది.
బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. చెల్లి కాపురం విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనై మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆధారంగా ఉండే కుమారుడిని కోల్పోయామంటూ తల్లి రమణ, మృతుడి భార్య మహాలక్ష్మి రోదించారు. తిరుపతి నాయుడి కుటుంబ సభ్యుల రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మరి.. తోబుట్టువుల కాపురం సంతోషంగా ఉండాలనే కోరుకునే సోదరులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.