నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. గత కొన్నేళ్లుగా మేకపాటి కుటుంబమే సింహపురి రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కొంతకాలం నుంచి వారి ఫ్యామిలీలో చిన్నపాటి మనస్పర్ధలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మేకపాటి ఫ్యామిలీలో మరో కలకలం చెలరేగింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. ఆయన కొడుకుగా తనను గుర్తించాలంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఆ లేఖతో పాటు పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ వివాదంలో చిక్కున్నారు. తనకు కుమారుడే లేడని ఇటీవలే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై శివచరణ్ అనే యువకుడు బహిరంగంగా అభ్యంతంర వ్యక్తం చేశాడు. తనను కొడుకగా ఒప్పుకోవాలంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ రాశాడు. నీకు కుమారుడు లేకపోతే..నేను ఎవరిని? అని ప్రశ్నించాడు. తనను, తన తల్లిని 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో శివచరణ్ పేర్కొన్నారు. తనను కొడుకుగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశాడు. అంతేకాక చదువుకు డబ్బులు చెల్లిస్తే నీ బాధ్యత తీరిపోతుందా? అంటూ ఆ యువకుడు ప్రశ్నించాడు. తన తల్లి తరువాత పరిచయమైన ఆమెను భార్యగా సమాజనికి పరిచయం చేశావని ఆ యువకుడు అన్నాడు.
ఈ లేఖతో పాటు, పాత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే నెల్లూరుకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకో వ్యవహారంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచారు. శివచరణ్ రెడ్డి గురించి తెలిసిన వారంతా చంద్రశేఖర్ రెడ్డితో అతనికి ఉన్న సంబంధాన్ని కాదనలేకుండా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఎవరూ ఆ లేఖను ఖండించలేదు. అలానే ఇప్పటి వరకు ఈ లేఖపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. మరి.. ఈ ఇష్యూకి ఏ విధంగా పుల్ స్టాప్ పడుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే.