తమ పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకు తగినట్లే పిల్లల కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటారు. పిల్లల సుఖం కోసం వారి సంతోషాలను సైతం త్యాగం చేస్తుంటారు. అలానే ఓ తల్లిదండ్రులు కష్టపడి తమ కుమారుడిని ఇంజనీరింగ్ చదవించారు. వారు కోరుకున్నట్లే అతడికి విదేశంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం వచ్చింది. ఇక విదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్నే మార్చేసింది. ఉన్నత విద్యనభ్యసించిన కుమారుడు మానసిక వికలాంగుడిగా మారాడు. తమ చేదోడు వాదోడుగా ఉండాల్సిన వారసుడు మంచానికే పరిమతయ్యాడు. ఇదే సమయంలో అతడి తండ్రి మరణించడంతో కూలి పనులు చేసుకుని బతికే ఆ తల్లి పైనే కుటుంబ బాధ్యత పడింది. వయోభారం మీద పడుతున్న పేగు బంధాన్ని కాపాడుకునేందుకు ఆ తల్లి ఒంటరి పోరాటం చేస్తుంది. ఆదుకునే దాతల కోసం ఆ తల్లి కళ్లు ఎదురు చూస్తున్నాయి. ఈ హృదయ విదారక ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం దండువారిపల్లెకు చెందిన కందుకూరి లక్ష్మమ్మ, రామచంద్ర దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు జనార్ధన్. ఆ దంపతులు కూలీపనులు చేసుకుంటూ కుమారుడిని చదించారు. అలా తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా జనార్ధన్ చదువులు బాగా రాణించే వాడు. ఈక్రమంలోనే కర్ణాటకలో 1997లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువు పూర్తి అయిన వెంటనే జనార్ధన్ కు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తమ కష్టాలు పోయి.. మంచి రోజులు వచ్చాయిలే అని సంతోష పడుతున్నారు. జనార్ధన్ ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించింది.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో రోడ్డు దాడుతుండగా లారీ రూపంలో జరిగిన ప్రమాదం అతడి భవిష్యత్తును చీకటి చేసింది. రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి జనార్ధన్ ను ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయం కావడంతో మతిస్థితిమితం కోల్పోయాడు. అతడికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. లక్షల్లో అప్పులు చేసి చికిత్స చేయించిన జనార్ధన్ పూర్వస్థితి రాలేదు. కొన్ని రోజుల క్రితం వరకు కూడా తమ కళ్ల ముందు ఎంతో బాగా తిరిగిన తమ కుమారుడు.. ఇప్పుడు మంచానికి పరిమితం కావడం ఆ తల్లిదండ్రులను కలిచివేసింది. ఆ వృద్ధ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల తరువాత రామచంద్ర గుండె పోటుతో మరణించాడు. ఇక కుటుంబ పోషణ మొత్తం తల్లిపైనే పడింది.
కుమారుడికి వైద్యం అందించలేక, అతడి దయనీయ పరిస్థితి చూసి భరించలేక 2012లో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వంతో పాటు పలువురు దాతాలు వైద్యానికి ముందుకు రావడంతో తిరుపతి స్విమ్స్ లో చికిత్స చేయించారు. అయినప్పటికీ పూర్తిగా నయం కాకపోవడంతో కుమారుడికి కోసం ఆ తల్లి ఇంటి వద్దనే ఉంటుంది. తనను పోషించే వయస్సులో ఉన్న కుమారుడు దుస్థితిని చూసి.. ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు. తమను ఆందుకునేందుకు దాతలు ఎవరైన ముందుకు రావాలని ఆమె ప్రార్ధించింది. మరి.. ఈ హృదయ విదారకమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.