ప్రతి ఒక్కరికి బాల్యం అనేది ఆట పాటలతో హాయిగా సాగే దశ. తోటి పిల్లలతో పాటు బడి వెళ్లి చక్కగా చదువుకుంటూ సరదగా గడిపే వయస్సు. చాలా మంది పిల్లలు తమ బాల్యన్ని అలానే సంతోషంగా గడుపుతుంటారు. అయితే విధి ఆడే నాటకంలో కొందరు మాత్రం బడికెళ్లే వయసులో కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటున్నారు. అలాంటి తొమ్మిదేళ్ల చిన్నారే.. స్రవంతి. లోకం తెలియని పసి వయసులో అనారోగ్యంతో అమ్మ దూరమైంది. ప్రమాదంతో తండ్రి మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కని, పెంచిన నాన్నకే అమ్మగా మారింది తొమ్మిదేళ్ల స్రవంతి. మరి చిట్టితల్లి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అనంతపురం జిల్లాలోని అమడగూరుకు చెందిన సూర్యనారాయణ ఐదేళ్ల కిందట అన్నదమ్ములతో ఘర్షణ పడి ఊరి వదలిపోయాడు. భార్య, బిడ్డలతో తీసుకుని నల్లమాడలో కాపురం పెట్టాడు. అయితే మూడేళ్ల క్రితం మామిడి తోటలో కాపలాదారుడిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఓ కొబ్బరి చెట్టు నుంచి కాయలను కోస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కొంతకాలనికి కోలుకున్నాడు. అయినా ఏ పనిచేయలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో నారాయణ భార్య కుటుంబాన్ని పోషించేది. విధి ఆ కుటుంబపై పగ పట్టిందా? అన్నట్లు ఆమె కూడా అనారోగ్యం బారినపడి.. ఈనెల 5న చనిపోయింది. దీంతో కని, పెంచిన నాన్నకే అమ్మగా మారి సేవలు చేస్తుంది ఆ చిన్నారి స్రవంతి.
దాతలు ఇచ్చిన సరకులతో ఆ తండ్రి కూతుర్ల జీవితం గడుస్తోంది. ఆ చిన్నారిని కదిలిస్తే.. కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. స్రవంతి స్థితి చూసిన ప్రతి ఒక్కరి గుండె తర్కుపోతుంది. తనకు చదువుకోలవాని ఉందని. అయితే నాన్నను చూసుకునే వారు లేక బడికి వెళ్లడం లేదని కన్నీటి పర్యంతమైంది. తమకు ఇల్లు కూడా లేదని పాకలో ఉంటున్నామని వాపోయింది. మానవతా హృదయంతో ఆదుకోవాలని వేడుకుంటోంది..ఈ చిట్టి తల్లి స్రవంతి.