పుట్టిన వారికి మరణం తప్పదు అనేది జగమేరిగిన సత్యం.. అందరికి తెలిసిన విషయం కూడా. అయితే కొందరి మరణాలు చూస్తుండే ఇలా కూడా చనిపోతారా? అని భావన కలుగమానదు. యమ ధర్మరాజు దారి కాచి మరీ.. ప్రాణాలు తీస్తున్నాడా? అనే సందేహం కలుగుతుంది. తాజాగా ఓ ఘటన చూస్తే అలానే అనిపిస్తుంది. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి వస్తున్న వారిని తాటి చెట్టు రూపంలో మృత్యువు వెంటాడి..బలితీసుకుంది. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం పిట్టాడ ప్రాంతంలోని ఓ గ్రామానికి కొందరు వరినాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. వరి పనులు ముగించుకున్న అనంతరం అదే ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో పిట్టాడ వద్దకు రాగానే అకస్మాత్తుగా తాటి చెట్టు విరిగి.. వీరు ప్రయాణిస్తున్న ఆటోపై పడింది. ఈప్రమాదంలో ఆటో నడుపుతున్న రొంగలి మహేష్ తో పాటూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కొండపర్తి బాడవకు చెందిన జునపాల సింహాచలం ప్రాణాలు కోల్పోయింది.
మరో మహిళ తామరాపల్ల రాజ్యలక్ష్మి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చనిపోవడంతో మృతుల గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.రోజూ వారి కూలీకి వెళ్తు.. జీవనం సాగిస్తున్న వీరిని మృత్యువు తాటి చెట్టు రూపంలో వెంటాడి బలితీసుకుంది. ఇంటికి తిరిగి వస్తారని తమ వారికి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు వారి మరణవార్త తెలిసింది. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.