జీవితంలో ప్రతి ఒక్కరం పొరపాటులో చేయడం సహజం. కానీ కొన్ని చిన్న పొరపాటులే పెద్ద ఘటనకు దారితీస్తాయి. అలాంటి వాటి వలన కొందరు తమ జీవితాలనే కొల్పోతుంటారు. మరికొందరు అనాథలుగా మారిపోతారు. తాజాగా ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. సంతోషంగా దైవ దర్శనంకి వెళ్లి.. వస్తున్న ఆ కుటుంబపై కారు రూపంలో కాలం కాటేసింది. కారు ఢీకొన్న ప్రమాదంలో కుటుంబ సభ్యులంతా మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ గోదావారి జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన నూక ఉమా మహేశ్వరరావు(35), ఆయన భార్య రేణుక(28), వారి పిల్లలు షర్మిల(9), దుర్గా ప్రసాద్ లు సెప్టెంబర్ 25న బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లారు. అక్కడ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి ఇంటికి ఉమామహేశ్వర రావు కుటుంబం బయలుదేరింది. మరొక బైక్ పై ఉమామహేశ్వరారవు తల్లిదండ్రులు వెళ్తున్నారు. కామవరపు కోట మండలం బొర్రపాలెం అడ్డరోడ్డు వద్దకు వెళ్లే సరికి ఎదురుగా వస్తున్న కారు.. ఉమామహేశ్వరావు కుటుంబం ప్రయాణిస్తున్న మోటర్ సైకిల్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహేశ్వరావు దంపతులను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.
అయితే ఏలూరు సమీపంలోకి వెళ్లే సరికి మహేశ్వరావు పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే ఏలూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈక్రమంలోనే ఆయన భార్య రేవతిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందారు. దీంతో కుటుంబ మొత్తం మృతి చెందడంతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరు గా విలపించారు. ఉమామహేశ్వరావుకు కి ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం మంజూరైంది. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం కుటుంబ సభ్యులతో కలసి శంకుస్థాపన కూడా చేశారు. సొంతింటి కల నెరవేరకుండానే ఆ కుటుంబ తిరిగిరాని లోకాలకు వెళ్లింది.