తల్లిదండ్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి బిడ్డ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తాయి. అలా ఇప్పటి వరకు ఎంతోమంది పేరెంట్స్ తీసుకున్న నిర్ణయానికి వారి పిల్లలు బలయ్యారు. తాజాగా అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి విషాద ఘటన ఒకటి జరిగింది.
ఆ రైతు దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి రోజూ బుడి బుడి అడుగులతో ఇంట్లో అల్లరి చేస్తూ పిల్లలు సందడి వినపడేది. ఇలా పిల్లలతో ఆ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. కట్ చేస్తే… ఆ రైతు దంపతులు ఒక రోజు దారుణ నిర్ణయం తీసుకున్నారు. తాము చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అభం శుభం తెలియని ఆ పసి పిల్లలు అనాథలుగా మారి.. ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం బెణికల్లు గ్రామానికి చెందిన ఆనంద్‌కు బిదురుకుంతానికి చెందిన గ్రామంలో ఉండే తన అక్కా కుమార్తె లక్ష్మీతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి శివరామకృష్ణ, ధనుష్, రవి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు.. అమ్మమ్మ వాళ్ల ఊరైన బిదురుకుంత ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఇక మిగిలిన ఇద్దరు కుమారులను తమ వద్దనే ఉంచుకుని ఈ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఆనంద్ తన తల్లి పేరు మీద ఉన్న ఎకరా పొలంతో పాటు, మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కౌలు తీసుకున్న పొలంలో పత్తికి, వరి పంటలను సాగు చేసేవారు.
అయితే ఐదేళ్లు నుంచి వారు వేసిన పంట దిగుబడి సక్రమంగా రాక బాగా నష్టాలు వచ్బాయి. ఇదే సమయంలో పెట్టుబడి, కుటుంబ పోషణ కోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. పంటచేతికి రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని ఆనంద్ ఆందోళనకు గురయ్యాడు. అలానే అప్పు ఇచ్చిన వాళ్లు తరచుగా డబ్బు తిరిగి ఇవ్వమని అడిగేవారు. వాళ్లకు సమాధానం చెప్పలేక ఆ దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గురువారం కూడా ఆనంద్ దంపతులు పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేసేందుకు పొలంకి వెళ్లారు. అదే సమయంలో అప్పు ఇచ్చిన వాళ్లు అన్న మాటలు గుర్తుకు వచ్చి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు.
తొలుత లక్ష్మి, ఆతరువాత ఆనంద్ పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వారిని గమనించి వెంటనే బళ్లారి విమ్స్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆనంద్ మృతి చెందగా.. ఆదివారం రోజున లక్ష్మీ మరణించింది. వీరి నిర్ణయంతో ముగ్గురు పిల్లలు అమ్మానాన్నలు లేని అనాథలుగా మారిపోయారు. ఈ దంపతుల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రుల కోసం ఆ చిన్నారులు చూస్తున్న ఎదురు చూపులు అక్కడి వారిని కలచివేశాయి. మరి.. పిల్లల గురించి ఆలోచించకుండా ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్న తల్లిదండ్రులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.