తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు, గుర్తింపు ఉంది. రోజుకి లక్షల్లో భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి కాలినడక తిరుమల చేరుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కాలినడక భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత పలు కీలక విషయాలను వెల్లడించారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల్లో 60 శాతం మంది వద్ద టోకెన్లు ఉండటం లేదని తాము గుర్తించామన్నారు. ఈ విషయంపై ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సాఫ్ట్ వేర్ పూర్తవగానే టోకెన్ల జారీని ప్రారంభిస్తామని తెలిపారు.
కాలినడకన వచ్చే భక్తుల్లో దర్శనం టికెట్లు, సేవా టికెట్లు తీసుకోని వారికి దివ్య దర్శనం టికెట్లు అందజేస్తామని స్పష్టం చేశారు. తోపులాట విషయంలో కూడా ఈవోకి ఫిర్యాదులు అందాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీవాణి భక్తులకు తిరుమలలోని ఎస్ఎన్జీహెచ్, ఏటీజీహెచ్ గెస్ట్ హౌస్లలో 88 గదులను కేటాయిస్తామన్నారు. కాషన్ డిపాజిట్ విషయంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ 10 బస్సులను ధర్మరథం స్థానంలో వినయోగించనున్నట్లు తెలిపారు.
శ్రీపద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రిలో నెలలో రెండు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేష్ విజయంవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. తిరుమలలో సర్వదర్శనం, ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ వంటి అంశాల్లో టీటీడీ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఈవో తెలియజేశారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న జరగనున్న సీతారాముల కల్యాణంలో ముఖ్యమంత్రి పాల్గొన్ని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.