తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. వెంకన్న సన్నిధికి వెళ్లే నడక మార్గానికి పక్కనే ఇద్దరు యువకులు స్మోకింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో మద్యం, మాంసంపై నిషేధం ఉన్న విషయం విదితమే. తిరుమల పవిత్రతకు కాస్త భంగం కలిగినా భక్తులు ఊరుకోరు. అందుకే కొండ పైకి వెళ్లడానికి ముందే అలిపిరి వద్ద క్షుణ్నంగా చెకింగ్స్ చేస్తారు. ఆ తర్వాతే భక్తుల్ని కొండ మీదకు అనుమతిస్తారు. కానీ కొందరు మాత్రం రూల్స్‌ను పట్టించుకోవడం లేదు. ఆ మధ్య కొందరు వ్యక్తులు తిరుమలలో మాంసం తింటూ.. మద్యం సేవిస్తూ దొరికిపోయారు. ఇప్పుడు తిరుమలలో మరోసారి అపచారం చోటుచేసుకుంది.
తిరుమల కొండ పైకి వెళ్లే తొలి ఘాట్ రోడ్డులో అవ్వచారి కోనకు సమీపంలో రోడ్డు మీద ఇద్దరు యువకులు ధూమపానం చేస్తూ కనిపించారు. ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా సిగరెట్లు కాలుస్తూ, సెల్ఫీలు దిగుతూ రచ్చ చేశారు. ఈ దృశ్యాలను ఎవరో దూరం నుంచి వీడియో తీశారు. రోడ్డు మీద, కాలిబాట మార్గం పక్కనే సిగరెట్లు కాలుస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై వెంకన్న భక్తులు మండిపడుతున్నారు. ఇది భద్రతా వైఫల్యం అంటూ ఫైర్ అవుతున్నారు.
పొరపాటున ఆ సిగరెట్ నిప్పు కాస్తా కిందపడితే పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి ఎంత పెద్ద ప్రమాదమని భక్తులు అంటున్నారు. ఇలాంటి ఘటనలతో ఆలయ పవిత్రత దెబ్బతింటోందని అంటున్నారు. ఇకపోతే, గతవారం తిరుమలలో గంజాయి దొరకడం తీవ్ర కలకలం రేపింది. వైకుంఠం క్యూ కంప్లెక్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీ గంగాధరం దగ్గర విజిలెన్స్ అధికారులు గంజాయిని సీజ్ చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా జరుగుతున్న ఈ వరుస ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.