వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్. ఎండలకు భయపనక్కర్లేదు. ఈ వేసవిలో శ్రీవారి భక్తులు కొండ మీద హాయిగా తిరగొచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతగానో పరితపించిపోతుంటారు భక్తులు. కలియుగ దైవం వేంకటేశ్వరుడ్ని ఒక్కసారి కనులారా చూస్తే చాలని కోరుకుంటారు. అందుకే దూరాభారం, వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా తిరుమలకు బయల్దేరుతారు. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. మున్ముందు వేసవి మరింత హీటెక్కనుంది. పిల్లలకు స్కూలు సెలవులు ఉంటాయి. కాబట్టి తిరుమలకు వేసవిలో రద్దీ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. తిరుమలలో మరో 10 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎంఈఐఎల్ ఆధ్వర్యంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ 10 ఎలక్ట్రిక్ బస్సులను తొలి విడతలో అందజేసింది. ఈ బస్సులు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి.
స్థానిక టీటీడీ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల ట్రాఫిక్ డీఐ జానకిరామిరెడ్డి పర్యవేక్షించారు. ఈ 10 బస్సులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించి, భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణ టార్గెట్గా టీటీడీ ఈ బస్సులను తీసుకొచ్చింది. తిరుమలలో ధర్మరథం కింద ఈ బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ప్రస్తుతం తిరుమల కొండ మీద 12 వరకు ఉచిత ధర్మరథం బస్సులు ఉన్నాయి. వాటి స్థానంలోనే ఈ పది ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ధర్మరథం బస్సులను తిరుపతిలో వినియోగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
కొత్త ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అందజేస్తోంది. ఈ బస్సులను టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా తయారు చేశారు. ఇందులో 23 సీట్లు ఉంటాయి. అదనంగా కొంత స్టాండింగ్ ఏరియా కూడా ఉంటుంది. వీటిల్లో ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో లాంటి వివరాలు డిస్ప్లేలో తెలియజేస్తుంది. వీటిల్లో సీసీ కెమెరాలు, అనౌన్స్మెంట్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అలాగే తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపేలా ఫొటోలు బస్సుల మీద ఉన్నాయి. కొత్త బస్సులకు రెండు వైపులా ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు ఆటోమెటిక్ తలుపులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరుమలకు రాకపోకలు సాగిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే వీటినీ తీర్చిదిద్దారు. ఈ వేసవి కాలంలో భక్తులు ఏసీ బస్సుల్లో తిరుమలలో హాయిగా తిరగొచ్చు.