ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. అసలు సచివాలయ వ్యవస్థ వల్ల వచ్చిన మార్పు ఏంటి? ఈ వ్యవస్థ ద్వారా తాము సాధించిన విజయాలేంటో ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ సేవలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తున్నట్లు అభిప్రాయ పడ్డారు. ఈ వ్యవస్థ ద్వారా 1.34 లక్షల పర్మినెంట్ జాబ్స్, 2.65 లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వంలో భాగస్వాములయ్యారని.. ప్రజలకు సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా ఏర్పాటైన విలేజ్ క్లినిక్స్.. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమైంది.. తద్వారా రాష్ట్రం కూడా మారిందంటూ తెలియజేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో ఎంతో స్పష్టమైన మార్పును తీసుకొచ్చిందన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు, డిజిటల్ గ్రంథాలయాలు, అవ్వాతాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడప వద్దకే పింఛన్, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం పంపిణీ నుంచి పంట అమ్మకం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలవడం ఇలా ప్రజలకు సేవలందించడంలో దేశంలోని ఏ రాష్ట్రము ఏపీకి దరిదాపుల్లో కూడా లేదనడం అతిశయోక్తి కాదన్నారు. ప్రభుత్వంలో పారదర్శకత వచ్చి.. అవసరం కోసం పైరవీలు చేసే పరిస్థితి పోయిందన్నారు. ఒక్క పింఛన్ కోసమే కాదు.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ఏ పథకం కోసం కూడా లంచం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఏ చిన్న పని ఉన్నా ఊరు దాటి మండలానికో, మరో పట్టణానికో వెళ్లాల్సిన పరిస్థితి లేదన్నారు.
ఇలాంటి గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీల కోసం 37,181 భవనాల నిర్మాణం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే వాటిలో 11,354 భవనాలు నిర్మాణం పూర్తి చేసుకోగా.. మిగిలిన వాటిలో చాలావరకు భవనాలు శ్లాబ్ దశలో ఉన్నాయన్నారు. డిసెంబర్ చివరినాటికి ఆ భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లున్నట్లు తెలియజేశారు. ఏపీలో ఇప్పుడు ఇంటర్నెట్ లేని గ్రామాలు మహా అయితే 110లోపే ఉంటాయన్నారు. పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై ఆసక్తిగా ఉన్నాయని, వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. పేదల జీవన ప్రమాణం పెంచేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యూనిసెఫ్ గ్రామ, వార్డు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రశంసించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆ సంస్థ అందించే సేవల్లో గ్రామ, వార్డు సచివాలయ వ్వస్థను, వాలంటీర్లను భాగస్వామ్యం చేసుకున్నారన్నారు.