సమాజంలో డబ్బులు సంపాదించుటకు కొందరు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా మోసాలకు తెగిస్తున్నారు. వారు తమ అవసరాలకు డబ్బులు సమకూర్చుకోవడమే కాకుండా దారుణాలకు తెగబడుతున్నారు.
ఈ రోజుల్లో ఎలాంటి దారుణాలకైనా, మోసాలకైనా పాల్పడుతున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం ఎటువంటి అఘాయిత్యాలకైనా తెగిస్తున్నారు. ఆడ, మగ అనే బేధం లేకుండా మోసపూరిత పనులకు పూనుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఈ విధంగానే మోసాలు జరుగుతున్నాయి. తాజాగా అనకాపల్లిలో ఓ కిలాడీ లేడీ మోసం బహిర్గతమయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనకాపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొంతకాలంగా రెండో పెళ్లి చేసుకోవడం కోసం సంబంధాలు చూస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అతనితో పరిచయం పెంచుకుంది. తను లాయర్‌నంటూ తను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నానంది. ఇంకేముంది మనోడికి గాలానికి చేప దొరికినట్లయింది. తను కూడా పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు కాబట్టి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగం పొంది ఉండాలని కండీషన్ పెట్టింది. అదే విషయం ఆమె తండ్రితో చెప్పించింది. బాధితుడు తనకు గవర్నమెంట్ జాబ్ లేదనడంతో ఆ యువతి తాను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని, తనకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉందని.. వారితో మాట్లాడి జాబ్ పెట్టిస్తానని చెప్పింది. దీనికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పుకొచ్చింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆ కిలాడీ మాటలు నమ్మి పెళ్లి అవుతుంది అదేవిధంగా జాబ్ కూడా వస్తుందని ఆశ పడి పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. అలా 2022 అక్టోబరులో రూ. 5 లక్షలు, నవంబరులో మరో రూ. 5 లక్షలు యువతి బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేశాడు. పది లక్షలు తీసుకుని ఆ లేడీ బాధితుడి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం మానేసింది. మాట్లాడడానికి కూడా తప్పించుకుని తిరుగుతుంది. ఇలా కొన్ని నెలల తర్వాత అతను ఆ యువతిని నిలదీశాడు. అప్పుడు ఆ కిలాడీ అసలు రూపం బయటపడింది. తన ప్రియుడితో కలిసి బాధితుడిని చంపుతానని బెదిరించింది. దీంతో తను మోసపోయినట్లు గ్రహించాడు బాధితుడు. అనకాపల్లి ఎస్పీ ఆఫీస్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.