భవనాల నిర్మాణాల కోసం ఏపీ ప్రభుత్వ అధికారులు విశాఖపట్నంలో ఉన్న రుషికొండపై తవ్వకాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతంలో ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి అరిచాయి. విశాఖకు తలమానికంగా ఉన్న ఈ రుషికొండను పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా పరిమితులకు మించి భవన నిర్మాణాల పేరుతో రుషికొండను తవ్వి నాశనం చేశారని, ఇలా పర్యావరణాన్ని నాశనం చేయడం ఏంటి అంటూ ఆరోపణలు చేశాయి. దీనిపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రుషికొండపై తవ్వకాల జరిపిన ఆ స్థలంలో తాజాగా ప్రభుత్వ అధికారులు గ్రీన్ మ్యాట్ మాదరిగా ఉన్న జియో మ్యాటింగ్ కప్పి ఉంచారు.
దీనిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక్కసారిగా ఆరోపణలు చేస్తున్నారు. రుషికొండను నాశనం చేసింది కాకుండా.. ఇలా కవర్ చేసేందుకు ఇలాంటి ఖరీదైన మ్యాట్ లు వేసి తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షపార్టీల ఆరోపణలపై అధికార పార్టీ నేతలు వెంటనే స్పందించారు. రుషికొండపై కొన్ని చోట్ల పరిచింది గ్రీన్ మ్యాట్స్ కాదని, అక్కడ మట్టిలో ఉన్న ఖనిజ లవణాలు వెళ్లిపోకుండా ఈ జియో మ్యాటింగ్ సహాయపడతాయని, అందుకే ఈ మ్యాటింగ్ పరచాల్సిన అవసరం ఏర్పడిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక కొన్నిరోజుల్లో మిగతా స్థలంలో కూడా ఈ జియో మ్యాటింగ్ పరుస్తామని కూడా అధికారులు తెలిపారు. రుషికొండ పరిరక్షణ కోసమే ఇదంతా చేస్తున్నామని అధికార యంత్రాంగం చెబుతోంది.
గ్రీన్ మ్యాట్ అసలు కథ:
ఏదైన స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు ఆ మట్టిలో ఉండే ఖనిజ లవణాలను కాపాడేందుకు దానిపై ఈ జియో మ్యాటింగ్ పరుస్తుంటారు. ఇలా కప్పి ఉంచడం ద్వారా చెట్లు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. దీని వల్ల తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కిందకు పడకుండా కూడా సహాయపడుతుంది. ఇది అంత్యంత ఖరీదైన మ్యాట్ అని చెప్పవచ్చు.