ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్ళాడు. బాగా చదివి చదువు పూర్తి చేశాడు. ఉద్యోగం కూడా సంపాదించాడు. రెండు నెలల్లో వస్తా అని చెప్పాడు. అంతలోనే మృత్యువు ఆ యువకుడ్ని కౌగిలించుకుంది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు.
పిల్లలు బాగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగంలో చేరితే తల్లిదండ్రులకు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఎంతో కష్టపడి నిద్రాహారాలు మానేసి పిల్లల్ని చదివిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశానికి పంపిస్తారు. పిల్లలు కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడతారు అనుకునే సమయంలో మృత్యువు కబళించేస్తుంది. విదేశాల్లో చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకునే తెలుగు విద్యార్థులను అక్కడ కొంతమంది ప్రాంతీయ బేధాలు, ఇతర గొడవలతో చంపేస్తున్నారు. గన్ కల్చర్ ఎక్కువగా ఉన్న అమెరికాలో తుపాకీ తూటాలకు మన తెలుగు యువకులు బలైపోయారు. కొంతమంది ప్రమాదవశాత్తు మరణించారు. తాజాగా మరో తెలుగు యువకుడు మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు.
ఇంకొన్ని రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్లిన తెలుగు యువకుడు మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మచిలీపట్నం చింతగుంటపాలెంకు చెందిన ట్రెజరీ ఉద్యోగి పొలుకొండ శ్రీనివాస్, మీనాకుమారి దంపతుల కుమారుడు లెనిన్ నాగ కుమార్.. ఎంఎస్ చదువు కోసం 2021లో కెనడా వెళ్ళాడు. అక్కడ లేక్ హెడ్ యూనివర్సిటీలో చేరాడు. ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అయితే ఫ్రెండ్స్ తో కలిసి కెనడాలోని సిల్వర్ ఫాల్స్ కి వెళ్లిన నాగ కుమార్ ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుల సమాచారంతో కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
కెనడా నుంచి తమ కొడుకు మృతదేహాన్ని తీసుకురావడానికి సతమతమవుతున్నారు. కేంద్రంతో మాట్లాడి తమ కొడుకు భౌతిక కాయాన్ని మచిలీపట్నం తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరిని నాగ కుమార్ తల్లిదండ్రులు కోరారు. దీంతో ఆయన స్పందించి నాగ కుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, ఒట్టావాలోని భారత హై కమిషనర్ సంజయ్ వర్మను కోరారు. ఇక నాగ కుమార్ మచిలీపట్నంలో ఇంటర్ వరకూ చదివాడు. ఆ తర్వాత భీమవరంలో ఇంజనీరింగ్ చేసి.. కెనడాలో ఎమ్మెస్ పూర్తి చేశాడు. ఒక ఇంటర్వ్యూకి వెళ్లి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. రెండు నెలల్లో ఇంటికి వస్తా అని తల్లిదండ్రులకు చెప్పాడు. ఇంతలోనే విషాదం నెలకొంది.