చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన అమ్మ, నాన్నల పేరు నిలబెట్టాలని, వారిని బాగా చూసుకోవాలని కలలు కనే యువకుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లే యువకులను మృత్యువు ఏదో రూపంలో వెంటాడుతోంది. ఒక తెలుగు యువకుడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు.
విదేశాల్లో చదువుకుంటున్న, స్థిరపడ్డ భారతీయులు, ముఖ్యంగా తెలుగు వ్యక్తులు ఇటీవల కాలంలో మరణిస్తున్న వార్తలు ఎక్కువయ్యాయి. వివక్ష, ప్రాంతీయ బేధాలు వంటి కారణాలతో మనవాళ్లను పొట్టన బెట్టుకుంటున్నారు. క్యాన్సర్ కారణంగా మొన్నా మధ్య ఖమ్మం డాక్టర్ హర్షవర్ధన్ మరణించడం, రీసెంట్ గా సాయి తేజస్వి అనే హైదరాబాద్ అమ్మాయి బీచ్ కు వెళ్లి గల్లంతయ్యింది. గతంలో కూడా ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు యువకులను కొంతమంది దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఇప్పుడు దుండగుల కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకుని ఉన్నత స్థాయిలో నిలబడాలని కలలు కన్న యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నారు దుర్మార్గులు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్ళాడు. అక్కడ కొలంబస్ ఫ్రాంక్లింటన్ లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ.. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి 12:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వీర సాయిష్ ను.. ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి యువకుడి వద్ద ఉన్న డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన సాయిష్ ను ఓహియో హెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
యువకుడు తండ్రి వీర రమణ నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. ఇప్పుడు ఈయన కొడుకు మరణించడంతో తల్లి విగతజీవిగా పడున్నారు. సాయిష్ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివసిస్తున్నారు. ఈమె చిన్న కుమారుడు సాయిష్ రెండేళ్ల క్రితమే అమెరికా వెళ్ళాడు. పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ ఇప్పుడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు సాయిష్. ప్రస్తుతం ఎమ్మెస్ చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. మరో 10 రోజుల్లో చదువు పూర్తై మంచి ఉద్యోగంలో స్థిరపడనున్నాడు. ఈలోపే దుర్మార్గులు సాయిష్ ను పొట్టన బెట్టుకున్నారు. సాయిష్ మరణ వార్త గురువారం రాత్రి 8 గంటలకు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో చెట్టంత కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని శోకసంద్రంలో మునిగిపోయారు సాయిష్ తల్లి.