ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశం కోసం సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటల ప్రాంతలో ఆయన ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరంలో విమానం ఎక్కారు. అయితే, బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. ఇక, విమానంలో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం టెక్నీషియన్స్ రంగంలోకి దిగారు.
సమస్య పెద్దగా చిన్నదా అన్న దానిపై క్లారిటీ లేదు. చిన్న సమస్య అయితే, పరిష్కారం అయిన వెంటనే ఆయన మళ్లీ అదే విమానంలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. అలా కాకపోతే మరో విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఇక, ఈ ఉదయం ఆయన పల్నాడు జిల్లా వినుకొండకు హెలికాఫ్టర్‌లో వెళ్లారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని మళ్లీ తాడేపల్లికి వచ్చారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీలో జరగబోయే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. ఉదయం 10.30నుంచి 5.30 వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ సమావేశం ఉండనుంది. పలు దేశాల పారిశ్రామిక వేత్తలు, అంబాసిడర్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. సాయంత్రం ఆయన పర్యటన ముగుస్తుంది. పర్యటన ముగిసిన వెంటనే ఆయన తాడేపల్లికి ప్రయాణం అవుతారు. ఢిల్లీనుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు విమానంలో వస్తారు. అక్కడినుంచి తాడేపల్లికి చేరుకుంటారు. మరి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.