టీడీపీ నేత, పెద కూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ రెండు రోజుల క్రితం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మహిళా నేతను అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఆమె అరెస్టు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. టీడీపీ నేత, పెద కూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ రెండు రోజుల క్రితం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మహిళా నేతను అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా నేతను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీరియస్ అయ్యారు. కృష్ణాజిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, అధికార వైఎస్సార్‌సీపీ మధ్య జరిగిన గొడవలకు సంబంధించి కళ్యాణిపై కేసులు నమోదు అయ్యాయి. అప్పటి నుండి ఆమె అజ్ఞాతంలో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
హనుమాన్ జంక్షన్‌లోని తన నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కళ్యాణి ఇంటికి వెళ్లి బలవంతంగా అరెస్టు చేశారు. కళ్యాణిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అరెస్టు చేయడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు చంద్ర బాబు. ‘తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణి పై తప్పుడు కేసు పెట్టిందే కాక.. బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు!’ అంటూ ట్వీట్ చేశారు.
మూల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అక్రమ అరెస్ట్‌లు రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. జగన్ అవినీతి, రాక్షస పాలనను ప్రశ్నిస్తే.. మహిళ అని కూడా చూడకుండా అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదం చేయడం దుర్మార్గం అన్నారు. బెడ్ రూంలోకి చొరబడి ఉగ్రవాదిలా అరెస్ట్ చేయడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు. జగన్ మెప్పు కోసం పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడి చేసి.. వాహనాలకు నిప్పంటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇరు పార్టీ నేతల మధ్య కాస్త ఘర్షణ వాతావరణం నడిచింది. ఈ గొడవల్లో పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మూల్పూరి కళ్యాణిపైనా కేసులు నమోదు కాగా, తాాజాగా ఆమెను అరెస్ట్ చేశారు.
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణి పై తప్పుడు కేసు పెట్టిందే కాక…. బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు! @APPOLICE100 pic.twitter.com/MSpqkQ8uJh
— N Chandrababu Naidu (@ncbn) April 10, 2023