ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ వర్సెస్ టీడీపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే.. తమపై దాడులు చేస్తున్నారని.. అంతేకాదు అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏపీ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి.
దేవినేని తో పాటు అఖిల పక్ష నేతలను అరెస్ట్ చేసి మైలవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లకు సంబంధించి తుది జాబితాలో మైలవారాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోవడం పై అఖిల పక్ష నేతలతో నిరసనకు దిగారు. అయితే దీనికి సంబంధించిన జాబితా సీఎం జగన్ ఇప్పటికే గవర్నర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. దేవినేని నిరసనకు పలు పార్టీలకు చెందిన వారు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రోడ్డుపై బైఠాయించిన దేవినేని సహా టీడీపీ, ఇతర పార్టీల నేతలను అదుపులోకి స్టేషన్ కి తరలించారు.