టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్న సమయంలో.. నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అనారోగ్యం కారణంగా తారకరత్న శరీరం నీలంగా మారడమే కాక.. సుమారు 45 నిమిషాల పాటు పల్స్ కూడా అందలేదని వైద్యులు తెలిపారు. తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయిందని వైద్యులు గుర్తించినట్లు బాలయ్య తెలిపారు. ఆయనకు స్టంట్ వేశామని వైద్యులు వెల్లడించారు.
తారకరత్నకు తొలుత కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇక ఆయన అనారోగ్యం విషయం తెలిసి.. భార్యఅలేఖ్యారెడ్డి, కుమార్తె శుక్రవారం సాయంత్రం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో.. డాక్టర్లతో చర్చించి.. తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఆ సమయంలో ఆయన వెంట సతీమణి అలేఖ్యారెడ్డి, నందమూరి బాలయ్య కూడా ఉన్నారు.
శుక్రవారం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం రప్పించారు. అలేఖ్యారెడ్డి రిక్వెస్ట్ మేరకు.. ఆ అంబులెన్స్‌లోనే కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో.. చికిత్స కొనసాగిస్తూ.. తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే బెంగళూరు నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకురావడంతో కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు తారకరత్నకు వైద్యం అందించారు. అనంతరం ఆయనను బెంగళూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
తారకరత్నను బెంగళూరు తరలించడం కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాట్లు చేశారు. దీని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంబులెన్స్‌కు ఎలాంటి ఆటంకాలు రాకుండా గ్రీన్ ఛానల్ తరహాలో తారకరత్నను బెంగళూరు తరలించడానికి కర్ణాటక సర్కార్ సహకరిస్తోందని తెలిపారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి బైపాస్ రోడ్డుకి దగ్గర హోసూరు సమీపంలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. తారకరత్నకు ప్రాణాపాయం లేదని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.