సిమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఓ బాలుడు చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ యజమాన్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు చిన్నా.. పెద్దా తేడా లేకుండా ఈత కొట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పల్లెటూల్లో బావులు, ఏళ్లు, చెరువుల్లో ఈతలు కొడుతూ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, పట్టణాల్లో ఆ అవకాశం ఉండదు. ఈత కొట్టాలన్న ఆసక్తి ఉన్నవారు స్విమ్మింగ్ పూల్స్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కొన్ని సార్లు స్విమ్మింగ్ పూల్స్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు కొన్ని సార్లు ప్రాణాలు తీస్తూ ఉంటాయి. తాజాగా, ఏపీలోని అనకాపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఏ బాలుడు చనిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మునగపాక మండలం, అరబ్బుపాలెంకు చెందిన గంగునాయుడు, మాధురి దంపతులకు ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడు పవన్ కుమార్, చిన్న కుమారుడు చరణ్. తాజాగా, ఈ ఇద్దరు తల్లిదండ్రులతో కలిసి దగ్గరలోని స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లారు. తండ్రి పిల్లలను వాటర్‌లో ఆడిస్తుంటే.. తల్లి ఫొటోలు తీస్తోంది. ఇంతలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది. చిన్న పిల్లాడు చరణ్ అనుకోకుండా మునిగిపోయాడు. వాడిని పట్టుకుని అన్నపవన్ కుమార్ కూడా మునిగిపోయాడు. ఇది గమనించిన గంగునాయుడు చిన్న అబ్బాయి చరణ్‌ని కాపాడగలిగాడు. కానీ, పెద్ద అబ్బాయి పవన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. కంటికి రెప్పలా చూసుకునే కొడుకు తమ కళ్లెదుటే స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోవటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. పవన్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రవికుమార్ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత నిర్వాహకులు స్విమ్మింగ్ పూల్ మూసివేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరి, ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.